Begin typing your search above and press return to search.

బాబు ఓడిపోతే.. మొదటి కారణం ఇదే అవుతుంది

By:  Tupaki Desk   |   13 April 2019 10:57 AM IST
బాబు ఓడిపోతే.. మొదటి కారణం ఇదే అవుతుంది
X
నువ్వా నేనా? అన్న రీతిలో సాగిన ఏపీ ఎన్నికల పర్వం ముగిసింది. ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఈవీఎంలలో వారి ఓట్లు సీల్ అయి.. చీకటి గదిలో మే 23 కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాయి. గెలుపోటముల మీద చర్చ జోరుగా సాగుతోంది. మెజార్టీ వర్గాల నుంచి జగన్ గెలవబోతున్నారని.. బాబు ఓడిపోతున్నట్లుగా మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికి వారు.. తమకు తోచిన విశ్లేషణలు చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా వినిపిస్తున్న కొన్ని వాదనలు ఆసక్తికరంగానే కాదు.. నిజమే కదా? అన్నట్లు ఉంటున్నాయి. అందులో ముఖ్యమైనది ఇప్పుడు చెప్పబోయే అంశం. ఏపీలో జరిగిన ఎన్నికల్లో బాబు ఓడిపోతే.. కారణం ఏమవుతుంది? ఏపీ ప్రజలు ఆయన్ను ఎందుకు రిజెక్ట్ చేసి ఉంటారన్న ప్రశ్నలకు వచ్చే సమాధానం ఏమిటో తెలుసా?

చంద్రబాబు తన మాదిరి ఉండకుండా.. వైఎస్ మాదిరి ఉండాలనుకోవటం. ఆయన స్టైల్ ను అనుకరించటం.. అందులో భాగంగా ఆయన తీరును ఫాలో అవుతూ దారుణమైన తప్పులు చేయటం. వైఎస్ స్టైల్ ను అనుసరిస్తే గెలవాలి కానీ ఓడిపోవటం ఎందుకంటారా? దానికి కారణం ఉంది.

వైఎస్ అన్నంతనే ఆయనకుండే స్టైల్ ఆయనకు ఉంది. ఆయన ఉదారంగా ఉంటారన్న విషయం అందరూ చెబుతారు. అదే సమయంలో కొన్నింటి విషయంలో చాలా మొండిగా ఉంటారు. వెనక్కి తగ్గరు. వరాలు ఇచ్చే విషయంలో ఎలా ఉంటారు.. తోక జాడించే వారిని ఎలా కట్ చేయాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అన్నింటికి మించి.. ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఆయన పంథా వేరుగా ఉంటుంది.

రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబు.. పదేళ్ల విపక్ష నేత హోదా నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే.. తనకంటూ ఉన్న స్టైల్ ను పక్కన పెట్టేసి.. వైఎస్ లో పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. ఎవడిని తిననీయకుండా ఉండటం.. పాలనను పరుగులు పెట్టించటం.. నేతలు తోక జాడిస్తే.. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించటం.. అధికారులతో కటువుగా ఉండటం.. ముఖ్యమంత్రిగా కంటే కూడా సీఈవోగా వ్యవహరించే ధోరణిని పక్కన పెట్టేశారు.

ఎవరేం చేసినా.. లైట్ తీసుకునే తీరును అలవాటు చేసుకున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతే చూస్తూ ఊరుకున్నారే తప్పించి.. తోక కట్ చేయటానికి అస్సలు ఇష్టపడలేదు. హద్దులు దాటిన వారికి చెక్ చెప్పటం.. ఓవర్ చేస్తే తాట తీస్తానన్న మేసేజ్ ఇవ్వటంలో మిస్ అయ్యారు. దీంతో.. ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెలరేగిపోయారు. తన వారు చేసే తప్పుల్ని చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే తన ఇమేజ్ పెరుగుతుందని భావించారే కానీ.. బాబు నుంచి అలాంటి పాలనను ప్రజలు కోరుకోరని.. చండశాసనుడిగా వ్యవహరిస్తూ.. విభజన కారణంగా దెబ్బ తిన్న ఏపీని బాగు చేస్తారని ప్రజలు భావించారు.

దీనికి భిన్నంగా తన పార్టీ ఎమ్మెల్యేలు ఇసుకను విపరీతంగా తినేస్తున్నా.. భూఅక్రమాలకు పాల్పడుతున్నా.. వనజాక్షి ఎపిసోడ్ లు చోటు చేసుకుంటున్నా చర్యలు తీసుకోవటంలో దొర్లిన నిర్లక్ష్యమే బాబు కొంపముంచటానికి కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అంతా బాగున్నప్పుడు సంక్షేమ పథకాల ఫలాలు అక్కరకు వస్తాయే కానీ.. వర్గాల వారీగా విడదీస్తూ.. నీకింత డబ్బులిస్తున్నా.. నీకింత మొత్తాన్ని ఇస్తున్నా.. కాబట్టి వారంతా నాకే ఓటు వేస్తారన్న లెక్కలు కూడా బాబును ముంచే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

బాబు.. బాబు మాదిరే ఉంటే.. బాగుండేది. అందుకు భిన్నంగా వైఎస్ ను ఫాలో అయ్యారు. అది కూడా తప్పు కాదు. కానీ.. వైఎస్ ను ఫాలో కావటం అంటే అందరికి సాధ్యమయ్యే పని కాదు. ఆయనలోని ఒకట్రెండు యాంగిల్స్ ను ఫాలో అయితే మైలేజీ రావటం తర్వాత.. మొదటికే మోసం వస్తుంది. బాబు తాజా పరిస్థితి ఇలాంటిదే అన్న అభిప్రాయం ఉంది.