Begin typing your search above and press return to search.

హైదరాబాద్ స్మార్ట్ కాదా?

By:  Tupaki Desk   |   16 Dec 2015 10:23 PM IST
హైదరాబాద్ స్మార్ట్ కాదా?
X
ఉమ్మడి రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ ను స్మార్ట్ సిటీల జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. తొలుత హైదరాబాద్ ను కూడా పంపించి, ఆ తర్వాత అది కూడా ఎన్నికల ముందు దానిని తొలగించింది. హైదరాబాద్ బదులుగా మరొక ప్రతిపాదిస్తామని కేంద్రానికి సమాచారం ఇచ్చింది. ఎన్నికల ముందు హైదరాబాద్ ను స్మార్ట్ సిటీ జాబితా నుంచి ప్రభుత్వం ఎందుకు తప్పించింది? ఇందుకు అధికార వర్గాలు రకరకాల కారణాలను వినిపిస్తున్నాయి.

స్మార్ట్ సిటీగా ఎంపిక కావాలంటే సదరు నగరానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ నగరంలో ఆస్తి - నీటి పన్నులన్నీ పూర్తి స్థాయిలో వసూలు కావాలి. నగర కార్పొరేషన్ కు రావాల్సిన ఇతరేతర బకాయిలు కూడా ఏమీ ఉండకూడదు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఉంటుందన్న భరోసా ఉంటేనే దానిని కేంద్రం స్మార్ట్ నగరంగా ప్రకటిస్తుంది. ఇందుకు కారణం, స్మార్ట్ గా ప్రకటించిన నగరంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుంది. టోల్ గేట్ల తరహాలో వాటికి సంబంధించిన మొత్తాలను కూడా ప్రజల నుంచే వసూలు చేసుకుంటుంది. ఉదాహరణకు, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తుంది. అందుకుతగ్గ డబ్బులను ప్రజలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు - డ్రైనేజీ - టెలి కమ్యూనికేషన్లు - రహదారులు తదితర సౌకర్యాలను కల్పిస్తే వాటికి సంబంధించిన నిధులను ఏదో రూపంలో వసూలు చేసుకుంటుంది.

ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ ఎంసీలో ఇప్పటికే ఉన్న బకాయిలను ప్రభుత్వం రద్దు చేస్తోంది. నిరుపేదల పేరిట మధ్యతరగతి వర్గాల వరకూ బకాయిదారుల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. విద్యుత్తు - మంచినీళ్లు - ఇళ్లు తదితరాల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇన్ని బకాయిలు ఉంటే, వాటిని లబ్ధిదారులు చెల్లించకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రభుత్వం వస్తే అటువంటి నగరాన్ని కేంద్రం ఎంపిక చేయదని, అందుకే దానిని ప్రతిపాదనల నుంచి తొలగించిందని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ప్రభుత్వ ఎన్నికల రాజకీయాలకు ప్రజలు బలవుతున్నారని చెబుతున్నాయి.