Begin typing your search above and press return to search.

ఉన్నట్లుండి ఎందుకింత వర్షం బ్రదర్..?

By:  Tupaki Desk   |   6 May 2016 6:59 AM GMT
ఉన్నట్లుండి ఎందుకింత వర్షం బ్రదర్..?
X
వాతావరణం సినిమాటిక్ గా మారిపోయింది. మండే ఎండలు.. ప్రాణాలు తీసే వడగాలులు.. మంట పుట్టించే ఉక్కపోతతో తెలుగు ప్రాంతాల్లోని ప్రజలు అల్లాడిపోయిన పరిస్థితి. రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి వరకూ ఉన్న వాతావరణానికి.. గురువారం అర్థరాత్రి రెండుగంటల దాటిన తర్వాత మారిన వాతావరణానికి ఏ మాత్రం సంబంధం లేని పరిస్థితి.

మండించే ఎండల నుంచి వణికించే వానలు ఎందుకు వచ్చాయి? ఎలా సాధ్యమయ్యాయి? వాతావరణంలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? ఎందుకిలా జరిగిందన్న సందేహాలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తే.. ఇదంతా ముందు నుంచి జరుగుతున్న పరిణామంలో భాగంగా చెప్పి. విదర్భ నుంచి కర్ణాటక.. తెలంగాణ.. రాయలసీమ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో.. వర్షాలు కురిసాయి. నిజానికి ఈ ద్రోణి ప్రభావం గడిచిన రెండు రోజలుగా వివిధ ప్రాంతాల్లో ఉంది. ఈ కారణంగానే మంగళవారం నుంచి అడపాదడపా వర్షాలు పడుతున్న పరిస్థితి.

కాకుంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్నిచోట్ల కాకుండా కొన్ని చోట్లే ఇలాంటి పరిస్థితి ఉంది. అలాంటిది కాస్తా.. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత మాత్రం రెండు తెలుగురాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు విరుచుకుపడిన పరిస్థితి. ఈ ద్రోణి బలంగా ఉన్న పక్షంలో మరికొద్దిరోజులు వర్షాలు పడే వీలుందని చెబుతున్నారు.