Begin typing your search above and press return to search.

నందమూరి సుహాసిని..అను నేను..!

By:  Tupaki Desk   |   18 Nov 2018 5:30 PM GMT
నందమూరి సుహాసిని..అను నేను..!
X
నందమూరి సుహాసిని. నాలుగు రోజుల క్రితం వరకూ తెలుగు రాష్ట్రాల ప్రజలెవరికీ తెలియని పేరు. ఇంకా చెప్పాలంటే... మొద‌టి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా పెద్దగా పరిచయం లేని పేరు. కానీ తెలంగాణ ముందస్తు ఎన్నికల చివరి అంకంలో ఈ పేరు హఠాత్తుగా తెర పైకి వచ్చింది. కాదు.. కాదు... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారు. మహానటుడు ఎన్.టి.రామారావు మనవరాలు - నందమూరి హరిక్రిష్ణ కుమార్తె అయిన నందమూరి సుహాసినిని కూకట్ పల్లి ఎన్నికల బరిలో దింపారు చంద్రబాబు నాయుడు. ఇది తెలంగాణ తెలుగుదేశం నాయకులనే కాదు... మొత్తం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు వారందరినీ ఆశ్చర్యపరచిన అంశం. చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను ప్రయోగించి నందమూరి వంశానికి చెందిన సుహాసినిని రంగంలోకి దించారు. ఇది నందమూరి కుటుంబానిని కూడా అయోమ‌యానికి గురిచేసిన‌ అంశం. సుహాసిని అభ్యర్ధిత్వం ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి - వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకు కూడా మేలు జరిగేలా చక్రం తిప్పారు బాబు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు నందమూరి హరిక్రిష్ణ కుటుంబం నుంచి ఒకరికి టిక్కట్ ఇచ్చినట్లుగా సానుభూతిని సైతం కొట్టేశారు చంద్రబాబు నాయుడు.

ఇక ఇప్పుడు మరో కొత్త అంశాన్ని తెర పైకి తీసుకువచ్చారు చంద్రబాబు నాయుడు. కానీ చంద్ర‌బాబు అస‌లు టార్గెట్ వేరు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తే నందమూరి సుహాసినిని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. ఈ కొత్త ఎత్తుగడతో బాబుకు రెండు లాభాలు. ఒక‌టి బాబుకు గాని ఆయ‌న వార‌సుడికి గాని ఏరోజైనా ప‌క్క‌లో బ‌ల్లెం అవుతార‌ని భావిస్తున్న ఎన్టీఆర్‌ ను అయోమ‌యంలో ప‌డేయ‌డం. చెల్లిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేస్తే ఏ అన్న మాత్రం సంతోష‌ప‌డ‌డు. రేపు పొద్దున ఎన్టీఆర్ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏ స్టెప్ వేయాల‌న్నా ఇది వెన‌క్కు లాగే అవ‌కాశం ఉంటుంది. ఇది ఎన్టీఆర్‌ పై బాబు మాస్ట‌ర్ స్ట్రోక్‌. పైగా ఈ నిర్ణ‌యం వ‌ల్ల నందమూరి హరిక్రిష్ణ‌ కుమారులు తారక రామారావు, కల్యాణ్ రామ్ లను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి వాడుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు రేపు మ‌హాకూట‌మి గెలిస్తే ద‌క్కే కీల‌క ప‌దవుల‌ను కుటుంబం నుంచి బ‌య‌ట‌కు పోకుండా ఏ వివాదం లేకుండా కుటుంబంలోనే ఉంచొచ్చు. తెలంగాణ రాజకీయాలలో తనదైన మార్కు రాజకీయాలను నడిపించవచ్చునన్నది బాబు ప్లాన్ గా చెబుతున్నారు.

ఇక ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న రెండో పెద్ద కార‌ణం... తెలంగాణ‌లో ఇపుడు చంద్ర‌బాబుకు వ్య‌తిరేక గాలి వీస్తోంది. దానిని గ‌త నెల‌రోజుల్లో కేటీఆర్‌ - కేసీఆర్ లు రెట్టింపు చేశారు. దీంతో బాబు వ్య‌తిరేక గాలి మ‌హాకూట‌మి మీద ప‌డ‌కుండా ఉండాలంటే... తెలంగాణ‌లో ఎంతో కొంత సానుకూల‌త ఉన్న నంద‌మూరి కుటుంబాన్ని వాడుకోవాలి. దానికి ఓ వ్య‌క్తి కావాలి. ఎవ‌రైతే బాగుంటుంద‌ని ఆలోచించిన చంద్ర‌బాబు ఎంతో కొంత రాజ‌కీయ ప‌రిచ‌యం ఉన్న సుహాసినిని పెడితే అటు హ‌రికృష్ణ సానుభూతి - ఇటు నంద‌మూరి పాజిటివిటీ రెండు క‌లిసి వ‌స్తాయి. ఈ నిర్ణ‌యం ప్ర‌జ‌లు కూడా స్వాగ‌తిస్తారు. అంటే ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు ఠా!

ఈ కొత్త వ్యూహం బానే ఉంది సరే.... అసలు తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. మహాకూట‌మి ప్రయత్నాలు సఫలం అవుతాయ‌ని చెప్పడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. మ‌హాకూటమిలో విబేధాలు నానాటికి పెరుగుతున్న ఈ దశలో తెలంగాణలో కలగూర గంప మహాకూటమి విజయం అంత సులభం కాదని వారంటున్నారు. ముందుగా ప్లాన్ వన్... అంటే ఎన్నికల్లో విజయం సాధించడం జరిగితే ఆ తర్వాత ప్లాన్ బి అమలు గురించి... అదే హరిక్రిష్ట కుమార్తెను ఉప ముఖ్యమంత్రిని చేయడం గురించి ఆలోచించవచ్చునని అంటున్నారు విశ్లేషకులు.