Begin typing your search above and press return to search.

‘లెక్క’ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన జగన్ పత్రిక

By:  Tupaki Desk   |   28 March 2016 4:15 AM GMT
‘లెక్క’ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన జగన్ పత్రిక
X
చేసిన పని ఎలాంటిదైనా దాన్ని సమర్థించుకోవటం.. సర్దిచెప్పుకోవటం ఒక కళ. అందులో జగన్ బ్యాచ్ కి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. కదిలించి మరీ కంప నెత్తిన వేసుకునే తీరుకు లైవ్ ఎంగ్జాఫుల్ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాజాగా ఆయన పార్టీకి చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రు ఇష్యూలో జగన్ తీసుకున్న నిర్ణయంపై నెహ్రూ అగ్గి మీద గుగ్గిలం కావటమే కాదు.. పార్టీని విడిచిపెట్టి ‘సైకిల్’ మీద ఎక్కేందుకు సీరియస్ గా పావులు కదపటం తెలిసిందే. దీనికి కారణం అధినేత జగన్ తీరేనని చెబుతున్నారు. ప్రజా పద్దుల ఛైర్మన్ పదవికి లెక్కలు బాగా తెలిసిన వ్యక్తి.. అంశాల్ని లోతుగా పరిశీలించే శక్తి ఉన్న జూనియర్ ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లాకు చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ పదవి అప్పగించాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి జ్యోతుల యమా హర్ట్ అయ్యారు. నిజానికి పదవి ఇవ్వకపోవటం కంటే కూడా.. ఆ పదవి ఇవ్వకపోవటానికి ‘‘లోతైన పరిశీలన. లెక్కలు సరిగా వచ్చి ఉండటం’’ లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకొని బుగ్గనకు ఆ పదవిని అప్పగించినట్లుగా ప్రచారం సాగింది. ఇది.. జ్యోతుల నెహ్రు ఇగోను భారీగా హర్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఇక్కడితో ఊరుకోకుండా .. తాజాగా జగన్ పార్టీ పత్రికలో ఇదే విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. బుగ్గనను ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా జగన్ ఎందుకు ఎంపిక చేశారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇంతకాలం బయట అనుకున్న మాటల్నే దాదాపు తిరిగి అప్పజెప్పిన తీరులో పత్రికలో తాజాగా అచ్చేయటం విశేషం. జ్యోతుల ఇగోను హర్ట్ చేసిన మాటల్ని జగన్ పత్రికలో మళ్లీ అచ్చేసి... బుజ్జగించాల్సిన వ్యక్తిని మరోసారి హర్ట్ చేయడంతో జ్యోతుల పార్టీ వీడటం ఇక ఎన్నో గంటలు పట్టదన్న విషయం తేలిపోయింది.

ఇక.. జగన్ మీడియా సంస్థలో ప్రచురితమైన ఒక కథనంలో చెప్పుకొచ్చిన వాదనను యథాతధంగా ఇచ్చేస్తే..
‘‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగానూ.. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగానూ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక విషయాల్లో మంచి అవగాహన ఉందన్న విషయం వెల్లడైంది. సభలో ఆకట్టుకునే రీతిలో ప్రసంగించటం నాయకత్వాన్నిఆకర్షించింది. ఆర్థిక అంశాలలో కేంద్రీకరించి పని చేయగలగటంతో పాటు కాగ్ తోనూ సమన్వయం చేసుకునే నేర్పు ఉన్న వ్యక్తిగా గుర్తించింది. అవకతవకలకు పాల్పడుతున్నఅధికార పార్టీని బుగ్గన ఇరుకున పెడతారని ఫార్టీ నాయకత్వం భావించింది. అందుకే పీఏసీ ఛైర్మన్ బాధ్యతలకు బుగ్గనను ఎంపిక చేసినట్లుగా వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి’’

నిన్నటి వరకూ నాలుగు గోడల మధ్య అన్నట్లుగా జరిగిన చర్చ ఈ రోజు పత్రికలో అచ్చేసుకోవటం.. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కథనం వండేయటం గమనార్హం. మరి.. తాజా పరిణామం జ్యోతుల నెహ్రును మరెంతటి ఆగ్రహానికి గురి చేస్తుందో..?