Begin typing your search above and press return to search.

కుంబ్లే దిగిపోయాడు.. అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   21 Jun 2017 7:31 AM GMT
కుంబ్లే దిగిపోయాడు.. అసలేం జరిగింది?
X
నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నదే నిజమైంది. అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి దిగిపోయాడు. ఈ సందర్భంగా కోహ్లికి తనతో పడట్లేదనే విషయాన్ని దాచుకోకుండా చెప్పేశాడు కుంబ్లే. తన పనితీరుతో కెప్టెన్ కు అభ్యంతరాలున్నట్లుగా బీసీసీఐ తనకు చెప్పినట్లు కుంబ్లే వెల్లడించాడు. దీంతో ఇప్పుడు అందరి వేళ్లూ కోహ్లి వైపే చూపిస్తున్నాయి. కుంబ్లే లాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని కోహ్లి సాగనంపేశాడంటూ విరాట్ పై విమర్శలు మొదలైపోయాయి. ఐతే అసలు భారత డ్రెస్సింగ్ రూంలో కొంత కాలంగా ఏం జరుగుతోంది.. కోహ్లికి-కుంబ్లే మధ్య సంబంధాలు ఏ స్థాయికి చేరాయి.. ఏ పరిస్థితుల్లో కుంబ్లే నిష్క్రమించాడన్నది ఇప్పుడు పరిశీలించాల్సిన విషయం.

ఆటగాడిగా కుంబ్లే ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అతడి కెరీర్లో ఎప్పుడూ ఏ వివాదం లేదు. ఐతే కుంబ్లే కొంచెం ముక్కు సూటి మనిషి. స్వతహాగా సీరియస్ గా ఉంటాడు. ఆటగాడిగా ఉన్నప్పటి నుంచి ప్రాక్టీస్ లాంటి విషయాల్లో అసలు రాజా పడే రకం కాదు. కానీ అతను క్రికెట్ ఆడే రోజులతో పోలిస్తే.. ఇప్పటి ఆటగాళ్ల తీరు మారింది. ఇప్పటి ఆటగాళ్లలో దూకుడెక్కువ. ఆట సీరియస్ గా ఆడుతూనే మిగతా సమయాల్లో సరదాగా ఉంటారు. ఇక్కడే కుంబ్లేకు.. ప్రస్తుత జట్టులోని మెజారిటీ ఆటగాళ్లకు తేడా కొట్టిందన్నది స్పష్టం. కుంబ్లే హెడ్ మాస్టర్ తరహాలో వ్యవహరిస్తున్నాడన్నది కోహ్లితో పాటు జట్టులో మెజారిటీ ఆటగాళ్ల నుంచి వినిపించిన కంప్లైంట్. అతిగా ప్రాక్టీస్ చేయిస్తున్నాడన్నది మరో ఫిర్యాదు.

కుంబ్లే వచ్చాక డ్రెస్సింగ్ రూం వాతావరణం చాలా సీరియస్ గా తయారైందని.. కోచ్ ఫ్రెండులా ఉండట్లేదని చాలామంది ఆటగాళ్లు అసంతృప్తికి లోనయ్యారు. అదే సమయంలో జట్టు ఎంపికతో పాటు కొన్ని విషయాల్లో కోహ్లికి.. కుంబ్లేకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు కోహ్లి దూరమైన సమయంలో అతడి ఇష్టానికి వ్యతిరేకంగా కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పించాడు కుంబ్లే. దానికి ముందు టెస్టులోనే కుల్దీప్ ను తీసుకోవాలని కుంబ్లే కోరగా.. కోహ్లి తిరస్కరించాడట. ఐతే కోహ్లి జట్టులో లేనపుడు కుంబ్లే కుల్దీప్ కు చోటు కల్పించి అతడి ఇగోను హర్ట్ చేశాడు. ఇలాంటి మరికొన్ని విషయాలు ఇద్దరి మధ్య దూరం పెంచాయి.

కోహ్లికి మామూలుగానే దూకుడు.. అహం ఎక్కువన్న సంగతి తెలిసిందే. అతను తగ్గే రకం కాదు. అలాగే హుందాతనానికి మారుపేరైన కుంబ్లే కూడా తగ్గలేదు. దీంతో దూరం అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఎవరో ఒకరు తప్పుకోక తప్పలేదు. కోహ్లిని తప్పించే పరిస్థితి లేదు కాబట్టి.. కుంబ్లేనే పక్కకు వెళ్లిపోయాడు. మొత్తానికి ఒక లెజెండ్ ఈ తరహాలో నిష్క్రమిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ప్రస్తుతం కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్.. టామ్ మూడీ ముందంజలో కనిపిస్తున్నారు. మరి వీరిలో ఎవరు కోచ్ అవుతారు.. కొత్త కోచ్ తో కోహ్లి ఎలా ఉంటాడు అన్నది ఆసక్తికరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/