Begin typing your search above and press return to search.

డైనోసార్ ర‌ఘు ఎలా బుక్ అయ్యాడు?

By:  Tupaki Desk   |   27 Sep 2017 4:25 AM GMT
డైనోసార్ ర‌ఘు ఎలా బుక్ అయ్యాడు?
X
ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.500 కోట్ల‌కు పైనే అక్ర‌మార్జ‌న‌ను వెన‌కేసుకున్న అవినీతి డైనోసార్ ర‌ఘుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్ట‌ర్ జీవీ ర‌ఘురామిరెడ్డి అక్ర‌మాస్తుల లెక్క‌లు వేస్తున్న అధికారులు విస్తుపోతున్నారు. అదే స‌మ‌యంలో అయ్య‌గారు వెన‌కేసిన అవినీతి మొత్తం లెక్క‌లు వింటున్న వారంతా నోరు వెళ్లబెడుతున్నారు. కీల‌క‌స్థానంలో ప‌ని చేసే వారి ఆదాయం ఇంత భారీగా ఉంటుందా? అని షాక్ తింటున్నారు.

ఈ అవినీతి భాగోతాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే.. ఏళ్ల‌కు ఏళ్లుగా వంద‌ల కోట్లు వెన‌కేసుకున్నా ప‌ట్టించుకోని ఏసీబీ.. ఇప్పుడే ఎందుకు క‌న్నేసింది? ర‌ఘు అవినీతి ఇప్పుడే ఎందుకు బ‌ట్ట‌బ‌య‌లైంది? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తుంది. అవినీతి విష‌యంలోనూ.. ఇష్యూ సెటిల్ మెంట్ విష‌యంలోనూ ర‌ఘు తీరు చాలా భిన్న‌మ‌ని చెబుతారు. డీల్ విష‌యంపై త‌న‌కు తానుగా కెల‌క‌ని త‌త్త్వం ర‌ఘుద‌ని చెబుతారు. ఏదైనా అనుమ‌తుల కోసం ర‌ఘు ద‌గ్గ‌ర‌కు ఫైల్ వ‌స్తే దాన్ని ట‌చ్ చేయ‌కుండా ఉంటార‌ట‌.

ఎన్ని రోజులైనా ఆ ఫైల్‌ను అలానే ఉంచేస్తార‌ట‌. అనుమ‌తి కోసం ఎదురుచూసే స‌ద‌రు వ్య‌క్తి త‌న‌కు తానుగా వ‌చ్చి.. ర‌ఘును ప్ర‌స‌న్నం చేసుకొని.. ప‌ద్ధ‌తిగా డీల్ మాట్లాడుకోవాల్సి ఉంటుంద‌ట‌. అది కూడా ఆఫీసులో ఒక్క మాట కూడా మాట్లాడ‌ని ర‌ఘును ప్రైవేటుగా క‌ల‌వాల్సి ఉంటుంద‌ట‌. ఒకసారి డీల్ ఓకే అయ్యాక‌.. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఫైల్ మూవ్ అయ్యేలా చేయ‌టంలో ర‌ఘు సాటి మ‌రెవ‌రూ ఉండ‌ర‌ట‌.

సాఫ్ట్ గా దోచేసే ర‌ఘు.. ఎవ‌రితోనూ గొడ‌వ‌లు పెట్టుకోర‌ట‌. ముఖం మీద చిరున‌వ్వు చెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డే ర‌ఘు ఈసారి అడ్డంగా బుక్ కావ‌టానికి కార‌ణం ఆయ‌న అడ్డ‌గోలు క‌క్కుర్తేన‌ని చెబుతారు. ఎవరితోనూ గొడ‌వ ప‌డ‌కూడ‌ద‌న్న బేసిక్ రూల్ మ‌ర్చిపోవ‌ట‌మే ర‌ఘు చేసిన త‌ప్పుగా అభివ‌ర్ణిస్తారు. వంద‌ల కోట్లు వెన‌కేసినా ఎక్క‌డా ఎవ‌రిని ప‌ల్లెత్తు మ‌ట అన‌ని ర‌ఘు.. తాజాగా 50 మంది అధికారుల‌కు ప్ర‌మోష‌న్లు ఇచ్చే విష‌యంలో ఆయ‌న ప‌డిన క‌క్కుర్తే అడ్డంగా బుక్ అయ్యేలా చేసింద‌న్న‌ది తాజా వాద‌న‌.

ప్ర‌మోష‌న్ల విష‌యంలో అన‌ర్హులైన దాదాపు 50 మందితో డీల్ ఓకే చేసుకున్నారు ర‌ఘు. ఈ డీల్ విలువ సుమారు రూ.10 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే.. ప్ర‌మోష‌న్ల విష‌యంలో ర‌ఘు కార‌ణంగా ఇబ్బంది ప‌డిన వారితో పాటు.. మంత్రిమాట‌ను కూడా లైట్ తీసుకోవ‌టం.. ఏసీబీ ఎంట్రీ కావాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. అన‌ర్హులైన ఉద్యోగుల ప్ర‌మోష‌న్ల‌కు ఒక్కొక్క‌రి నుంచి రూ.10 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన ర‌ఘు.. ఒక‌ద‌శ‌లో ఏపీ మంత్రి మాట‌ను సైతం లెక్క చేయ‌క‌పోవ‌టంతో మొద‌టికే మోసం వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఇటీవ‌ల రిటైర్ అయిన ఒక సీనియ‌ర్ ఉద్యోగి ర‌ఘు అక్ర‌మాస్తుల చిట్టా మొత్తాన్నిత‌యారు చేసి ఏసీబీ అధికారుల‌కు ఇవ్వ‌టం.. వారు రంగ‌ప్ర‌వేశం చేయ‌టంతో ర‌ఘు అక్ర‌మార్జ‌న రేంజ్ ఏమిటో బ‌య‌ట‌కు వ‌చ్చి.. అంద‌రిని అవాక్కు అయ్యేలా చేసింద‌ని చెప్పాలి. ఎవ‌రితోనూ గొడ‌వ ప‌డ‌ని త‌త్త్వంతో దోచేసుకున్న ర‌ఘు.. చివ‌ర‌కు ఒక సీనియ‌ర్ అధికారితోనూ.. మంత్రితోనూ ప‌డిన గొడ‌వే ఆయ‌న్ను అడ్డంగా బుక్ చేసింద‌న్న మాట వినిపిస్తోంది.