Begin typing your search above and press return to search.

నిజంగా నిజం.. కేసీఆర్ కు జ్వరం వచ్చింది తెలుసా?

By:  Tupaki Desk   |   6 Feb 2022 9:47 AM GMT
నిజంగా నిజం.. కేసీఆర్ కు జ్వరం వచ్చింది తెలుసా?
X
తిట్టేస్తారు కానీ తెలంగాణ సీఎం చాలా పద్దతి కలిగిన వ్యక్తి. ఆయనేం చేసినా రూల్ ప్రకారమే చేస్తారు. వెనుకా ముందు చూసుకోకుండా తిట్టి పోస్తారు కానీ.. లోతుల్లోకి వెళ్లి అస్సలు చూడరు. 67 ఏళ్ల పెద్ద మనిషికి జ్వరం లాంటివి రావా? ఏదో ఒంట్లో బాగోక.. ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి రాకపోతే.. అన్నేసి మాటలు అంటారు కానీ.. చివరి నిమిషం వరకు ఆయన ప్రధాని ప్రోగ్రాంకు హాజరు కావాలనే ఆశించారన్న మాటను ప్రభుత్వ వర్గాలు చెబుతుండటం గమనార్హం.

ఇలా ఎలా చెబుతారు? అన్న ప్రశ్నకు వారిచ్చే సమాధానం కాసింత ఆశ్చర్యపోయేలా.. పెద్ద సారు మేధస్సు ఎంతన్న విషయాన్ని తెలియజేసేలా ఉండటం గమనార్హం. శంషాబాద్ దగ్గర్లోని ముచ్చింత వద్ద రామానుచార్యుల వారి భారీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా వస్తున్న ప్రధాని మోడీని ఎయిర్ పోర్టులో స్వాగతం పలకటానికి.. తిరిగి వెళ్లే సమయంలో వీడ్కోలు పలకటానికి వీలుగా ఆయన తన పేరును పీఎంవోకు పంపారు కూడా.


ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు 20 మంది పేర్లతో కూడిన జాబితాను ప్రధాని కార్యాలయానికి పంపారు. అదే సమయంలో.. వీడ్కోలు పలికేందుకు 23 మంది జాబితాను కూడా సిద్ధం చేసి పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉంది. పీఎంవోకు పంపిన పత్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉండటం చూస్తే.. ప్రధాని మోడీకి స్వాగత.. వీడ్కోలుకు హాజరు కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన అన్న విషయాన్ని స్పష్టం చేసేలా జాబితా ఉంది. అయితే.. అనూహ్యంగా స్వల్ప జ్వరం రాకూడదన్నది రూల్ లేదుగా?

సరిగ్గా ప్రధానమంత్రి వచ్చే సమయానికి కాస్త ముందు కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆయన ఎయిర్ పోర్టులో స్వాగత.. వీడ్కోలు పలకలేకపోయారు. స్వల్ప జ్వరమని లైట్ తీసుకోలేం. ఎందుకంటే.. ఇప్పుడున్నది కరోనా కాలం. అలాంటి వేళ.. వెనుకా ముందు చూసుకోకుండా బయటకు రాకూడదు. ఈ కారణంతోనే కేసీఆర్ హాజరు కాలేదు. అంత మాత్రానికి.. కేసీఆర్ మీద అదే పనిగా ఆడిపోసుకోవటం తప్పించి.. మరింకేమీ లేదన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం. అధికారిక పత్రాల్ని చూసినంతనే కేసీఆర్ కు జ్వరం కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి హాజరు కాలేదు తప్పించి.. మరింకేమీ లేదన్నట్లుగా ఉండటం చూస్తే.. కేసీఆర్ తెలివే తెలివి అన్న భావన కలుగక మానదు.