Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో సరికొత్త దందా.. ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ అమ్మకాలు

By:  Tupaki Desk   |   24 March 2021 8:30 AM GMT
హైదరాబాద్ లో సరికొత్త దందా.. ఫ్రీ లాంచ్ పేరుతో రియల్ అమ్మకాలు
X
అనుమతులు ఉండవు. నిబంధనల్ని పాటించరు. గాలిలో మేడలు కట్టేస్తారు. ఖరీదైన బ్రోచర్స్ తయారు చేసి.. కలల ప్రపంచాలోకి తీసుకెళతారు. కోటి రూపాయిలు విలువైన ప్లాట్ ను కేవలం అరవై లక్షలకు ఇస్తామని కొందరు చెబితే.. మరో అడుగు ముందుకేసి.. యాభై లక్షలకే ఇచ్చేస్తామని మరికొందరు ఊరిస్తారు. దీనికి కొందరు బ్రోకర్లను సిద్ధం చేసుకోవటంతో పాటు.. ఖరీదైన మార్కెటింగ్ నెట్ వర్కుతో దోచేసే సరికొత్త రియల్ దందా హైదరాబాద్ మహానగరంలో మొదలైంది.

దేశంలో మరెక్కడా లేని రీతిలో తీసుకొచ్చిన ఈ ప్రీలాంచ్ దందాలో వేలాది మంది చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఈ ప్రీలాంచ్ ఆఫర్ అంటే మరేమిటో కాదు.. తాము కట్టబోయే భారీ నిర్మాణాన్ని ముందుగా డబ్బులు కట్టేస్తే.. ప్లాట్ బుక్ చేసినట్లుగా చెబుతారు. మార్కెట్ ధర ప్రకారం రూ.కోటి విలువ చేసే ప్లాట్ ను కేవలం సగానికే ఇచ్చేస్తామని చెప్పి ఊరిస్తారు. కాకుంటే.. మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ప్లాట్ ను కట్టి చేతికి ఇస్తామని మాట ఇస్తారు.

మరి.. అప్పటివరకు మా సొమ్ముకు భద్రత ఏమంటే.. ఆన్ డివైడెడ్ షేర్ అని ఆశ చూపిస్తారు. మరి.. దానితో ఏమైనా లాభమా? అంటే.. కంటి ముందు మన భూమి అని కనిపిస్తుందే తప్పించి.. దాన్ని ఏమీ చేసుకోలేని పరిస్థితి. చేతికి ఇచ్చిన పత్రాలతో ఏమైనా ప్రయోజనమా? అంటే.. నాలుక గీసుకోవటానికి కూడా పనికి రావని చెబుతారు. ఈ విధానంలో ప్లాట్ బుక్ చేసుకున్న వారు అడ్డంగా బుక్ అయిపోతారే తప్పించి.. అమ్మిన వారికి ఎలాంటి నష్టం ఉండదు.

ఎందుకిలా అంటే.. ఎకరం భూమిలో నిర్మించే భారీ ప్రాజెక్టులో వెయ్యి మందికి యాభై గజాలు.. వంద గజాలు మాత్రమే అమ్ముతారు. ఆ వంద గజాలు కూడా మిగిలిన వారితో కలిపి ఉన్నందువల్ల చెప్పిన సమయానికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే.. ఏమీ చేయలేని పరిస్థితి. మరి.. అమ్మేవాడి మీద చర్యలు తీసుకోలేమా? అంటే.. లేదనే చెబుతారు. ఎందుకంటే.. పత్రాల్లో అన్ని పక్కాగా కనిపించటంతో పాటు..తన చేతికి మట్టి అంటని రీతిలో ఉండే ఈ విధానంలో కొనుగోలు చేసే వారికే తప్పించి.. అమ్మే వారికి ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ప్రీలాంచ్ ఆఫర్ తో ప్రభుత్వ ఆదాయానికి సైతం భారీగా గండి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి దాదాపు రూ.5వేల కోట్ల మేర ఆదాయానికి గండి పడుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిద్ర లేవకపోతే.. ఈ ప్రీలాంచ్ ఆఫర్లు తెలంగాణ రియల్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. వేలాది మంది బాధితులుగా మారే అవకాశం ఉందంటున్నారు.