Begin typing your search above and press return to search.

ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్యకి అసలు కారణం అదేనా ?

By:  Tupaki Desk   |   22 Oct 2020 1:30 AM GMT
ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్యకి అసలు కారణం అదేనా ?
X
ఓ భూవివాదంలో భారీ స్థాయిలో రూ.1.10కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర తహసీల్దార్‌ నాగరాజు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనితో ఉన్న ఉద్యోగం కోల్పోయి, రిమాండ్ ఖైదీగా హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న సమయంలో ఈనెల 14న ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ ఆత్మహత్య కేసులో సరికొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోల పేర్లను నాగరాజు చెప్పడం అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది.

అయితే , ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో అండర్‌ ట్రయలర్‌ గా చంచల్‌ గూడ జైలులో ఉన్న నాగరాజు సెల్ ‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత ఔట్‌ సోర్సింగ్‌ లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా విధుల్లో చేరిన నాగరాజు, అక్కడి నుండి 15 ఏళ్ల కాలంలో ఆ ఉద్యోగం పర్మినెంట్‌ చేయించుకుని, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పదోన్నతులతో తహసీల్దార్‌ స్థాయికి ఎదిగాడు. కానీ, భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోవడంతో ..అంతే వేగంగా ఆ ఉద్యోగం కూడా ఊడిపోయింది.

నాగరాజును ఒకసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఇప్పుడు ఈ భూవివాదం కేసు మెడకు చుట్టుకోవడంతో అవమాన భారంతో బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చు అని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసున్నారు. అయితే, విచారణలో ఉన్నతాధికారుల పేర్లు చెప్పడంతో వారి పాత్ర గురించి పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదేకాక అధికారంలో ఉండగా బినామీల పేరుతో ఆస్తి కూడబెడితే, కష్టకాలంలో చూడటానికి వారెవ్వరూ రాలేదనే వేదన కూడా నాగరాజు ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో నాగరాజు మృతిపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వందల మంది ఇతర ఖైదీలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఉండగా లోపల ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం? అది కూడా ఓ మొద్దు టవల్‌తో హ్యాంగింగ్ ఎలా చేసుకుంటారు, ఆ సమయంలో పక్కనున్న ఖైదీలు ఏం చేస్తున్నట్లు అంటూ ఆయనది ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపణలు చేస్తుంది.