Begin typing your search above and press return to search.

నయింలో ఎంతమంది విలన్స్ అంటే..

By:  Tupaki Desk   |   17 Aug 2016 6:40 AM GMT
నయింలో ఎంతమంది విలన్స్ అంటే..
X
యాక్షన్ సినిమాలు విపరీతంగా చూసే తెలుగు ప్రేక్షకులకు విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిజం పెరగాలంటే విలనిజం అంత తీవ్రంగా ఉండాలి. విలన్ ఎంత క్రూరుడైతే.. హీరో హీరోయిజం అంతకు రెట్టింపు అవుతుంది. శక్తివంతుడైన విలన్ ను చావగొడితే హీరో ఇమేజ్ ఆకాశానికి అంటుంది. ఇదంతా రీల్ కథ. మరి.. రియల్ కథలో అలాంటివేమీ ఉండవు. సూపర్ మ్యాన్ లాంటి హీరో ఎక్కడా కనిపించడు. కానీ.. రీల్ లో కనిపించే విలన్లు మాత్రం రియల్ లైఫ్ లో అడుగడుగునా కనిపిస్తారు.

ఛత్రపతి సినిమాలో తన దగ్గర ఉన్న జనాల్ని విలన్ ఎంతగా వేధిస్తాడో..మరెంతభయపెడతాడన్నది వెండితెర మీద చూసినప్పుడు రక్తం మరిగి పోతుంది. అలాంటి వాడి అంతు చూసే హీరో కోసం చూస్తాం. హీరో వచ్చి విలన్ ను తుక్కు తుక్కు చేస్తుంటే.. ఆనందంతో విజిల్స్ వేస్తుంటాం. దురదృష్టం ఏమిటంటే.. రీల్ లో కనిపించే హీరో రియల్ లో ఉండడు. కానీ.. విలన్ మాత్రం కనిపిస్తాడు. పిల్లల్ని వేధించే విలన్లు.. పిల్లల్ని తమ అవసరాలకు వాడుకునే విలన్లు.. వారిని అడ్డుపెట్టుకొని దందా నడిపించే వాళ్లను చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ.. చాలా సినిమాల్లో కనిపించిన విలన్ల అందరిలోని అవలక్షణాలన్నీ గ్యాంగ్ స్టర్ నయింలో కనిపిస్తారు.

సొంత చెల్లి.. బావ అన్నది చూడని నయిం.. వారినే కాదు తన అవసరానికి అడ్డం ఉన్నారని భావిస్తే స్నేహితుడ్ని సైతం వేసేసేందుకు వెనుకాడని రాక్షసుడు. అలాంటి వాడికి చిన్నా.. పెద్దా అన్న వ్యత్యాసం ఉండదు. తన అవసరాల కోసం పిల్లల్ని పెద్ద ఎత్తున పెట్టుకున్న నయిం.. వారితో ఎంత వికారంగా వ్యవహరిస్తారన్న విషయాన్ని వారి నోటి నుంచి వింటున్న వారికి షాకింగ్ గా అనిపించటమే కాదు.. ఎన్నో తెలుగుసినిమాల్ని ఒక్కసారిగా చూసిన భావన కలిగినట్లుగా అనిపించటం ఖాయం. నయిం ఎన్ కౌంటర్ తర్వాత అతని నివాసం మీద దాడి చేసినప్పుడు పెద్ద ఎత్తున పిల్లలు కనిపించారు.

గ్యాంగ్ స్టర్ అయి ఉండి పిల్లలతో పని ఏముందన్న విషయం మీద దృష్టి పెట్టినప్పుడు అతగాడి వికారపు మైండ్ సెట్ బయటకు వచ్చింది. మొత్తంగా 24 మంది చిన్నారుల్ని తన స్థావరంలో బంధించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరిలో కొందరిని స్టేట్ హోంకు తరలించారు. అనంతరం వీరి నుంచి నయిం ఆరాచకాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన వారికి ఎంతకూ నోరు విప్పని పరిస్థితి. ఎందుకంటే నయిం పేరు వింటేనే వారు వణికి పోతున్నారట. నిత్యం పిల్లల్ని డీల్ చేసే అలవాటున్న వారికి సైతం వారం రోజుల పాటు పిల్లల నోటి నుంచి ఏమీ చెప్పించలేకపోవటం చూస్తే.. వారి భయం ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. పిల్లల్ని నయిం ఏం చేసేవాడన్న విషయంలోకి వెళితే.. తన వికారాల్ని తీర్చుకోవటానికి పిల్లల్ని పావులుగా చేసుకునేవాడని తెలుస్తోంది. పిల్లల్నినయిం ఏం చేసేవాడు? వారి పట్ల ఎంత రాక్షసంగా ఉండేవాడు? పిల్లలకు అతడంటే ఎందుకంత హడల్ అన్న విషయాల్లోకి వెళ్లినప్పుడు తెలిసిన విషయాలు షాక్ కు గురి చేస్తాయి.

విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారంతో హోంలో ఉన్న చిన్నారులతో పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు నయిం ఆరాచకాల గురించి వారు చెప్పిన విషయాలు చూస్తే..

= తన మాట వినని పిల్లల్ని తీవ్రంగా కొట్టేవాడు. ఎంత తీవ్రంగా అంటే.. ప్రస్తుతం హోంలో ఉన్న పిల్లాడికి కన్ను కనిపించదు. ఏం జరిగిందంటే అసలు విషయం చెప్పటానికి ఎనిమిది రోజుల సమయం తీసుకున్నారు. మొదట పడిపోవటం వల్ల కన్ను పోయిందని చెప్పినా.. ఎనిమిది రోజుల తర్వాత మాత్రం నయిం కొట్టటంతోనే అలా జరిగిందన్న అసలు నిజాన్ని చెప్పాడు.

= పసి పిల్లల్లో భయం పెంచటానికి పిల్లల్ని కూర్చోబెట్టి మరీ ఒక హత్య చేశాడు. పిల్లలు ఎవరైనా పారిపోతే వాళ్లకు ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించటం ద్వారా తీవ్రభయాన్ని వారిలో పెంచాడు.

=బొద్దింకను చంపి.. దాన్ని తినమని పిల్లలకు ఆదేశాలిచ్చేవాడు. ఎవరైనా చెప్పినట్లుచేయకపోతే చావబాదేవాడు.

= నయిం చెప్పినట్లు తింటూవాంతి చేసుకున్నా.. ఆ తర్వాత అయినా తినాల్సిందే.

= ఒక చిన్నారిని పారిపొమ్మని ప్రోత్సహించి.. పారిపోయే క్రమంలో తీసుకొచ్చి.. అందరి పిల్లల ముందు చావబాదాడు. దీంతో పిల్లలకు నయిం అంటే వణుకు.

= అల్కాపురిలోని ఇంట్లో పైన ఉండే నయిం.. పిల్లల్ని పైకి పంపమంటే అమ్మాయిల్ని మాత్రమే పంపేవాడు.

= దారుణమైన విషయం ఏమిటంటే.. నయిం చేసే వికారాలకు అతడి తల్లి.. భార్య.. చెల్లి అంతా వత్తాసు పలికేవారు. చిన్న పిల్లల్ని పైకి పంపిన తర్వాత వారితో వికార చేష్టలకు పాల్పడి.. తర్వాత వారికి మత్తు బిళ్ల వేసేవాడు.

= నయిం ఏం చేసేవాడని అడిగితే.. బట్టలు విప్పించి గలీజు పనులు చేసేవాడని పిల్లలు వాపోతున్న పరిస్థితి.