Begin typing your search above and press return to search.

పీక్ కు వెళ్లనున్న యాదాద్రి రియల్ ఎస్టేట్

By:  Tupaki Desk   |   7 Sep 2016 5:30 PM GMT
పీక్ కు వెళ్లనున్న యాదాద్రి రియల్ ఎస్టేట్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఏదైనా ఒక అంశం వచ్చిందంటే దాని వెనుక లెక్క చాలానే ఉంటుంది. ఈ విషయంలో మరో మాటకు తావే లేదు. సీజనల్ గా కొన్ని అంశాల్ని ప్రస్తావించే ఆయన.. కొంత గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా మరోసారి యాదాద్రి మీద తన ఫోకస్ ను పెట్టారు. ఇప్పటికే యాదాద్రిని మరో తిరుమల మహా క్షేత్రంగా చేయనున్నట్లు ప్రకటించి.. అందుకు తగ్గట్లే భారీ ప్లాన్ తో యాదాద్రి రూపురేఖలు మార్చాలన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ తిరుమలగా యాదాద్రిని చేయాలన్నది కేసీఆర్ కల అన్నది తెలిసిందే.

ఇప్పటికే ప్రకటించిన యాదాద్రి మాస్టర్ ప్లాన్ తో యాదాద్రి చుట్టుపక్కల రియల్ బూమ్ పెరిగింది. ఈ మధ్యన కాస్త డౌన్ అయినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి యాదాద్రి మీద తన డ్రీమ్స్ ను బయటపెట్టటమే కాదు.. 850 ఎకరాల్లో యాదాద్రి టంపుల్ సిటీని రూపొందించటమే లక్ష్యమని పేర్కొనటం గమనార్హం.

యాదాద్రికి అభిముఖంగా ఉన్న గుట్టల్ని టెంపుల్ సిటీగా మార్చటమే తన లక్ష్యంగా పేర్కొన్న కేసీఆర్.. ఈ సిటీలో విశాలమైన ఉద్యానవనాలు.. రహదారులు.. ఫుడ్ కోర్టు.. పార్కింగ్ స్థలాలు.. విశాలమైన రోడ్డు ఇలా చాలానే చెప్పుకొచ్చారు. కేవలం మాటలతో సరిపుచ్చకుండా టెంపుల్ సిటీలోని 250 ఎకరాల్లో రూ.207 కోట్లతో చేపట్టే పనుల్ని ఖారారు చేశారు. ఇందులో 200 కాటేజీలను 86 ఎకరాల్లో నిర్మించాలన్న మాట చెప్పిన ఆయన.. తాగునీరు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు విశాలమైన రహదారుల్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

యాదాద్రి మాస్టర్ ప్లాన్ తో ఇప్పటికే ఒక రేంజ్ కి వెళ్లిన యాదాద్రి రియల్ ధరలు.. తాజాగా ప్రకటనతో మరింత జోరందుకోవటం ఖాయమంటున్నారు. టెంపుల్ సిటీ ప్రకటనతో యాదాద్రి సైజు పెరగటమే కాదు.. రియల్ ధరలు పీక్ స్టేజ్ కు టచ్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. యాదాద్రిలో కాటేజీల నిర్మాణానికి పలు కార్పొరేట్ కంపెను వస్తున్నట్లుగా ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో యాదాద్రి దశ.. దిశ మొత్తంగా మారిపోనుందన్న మాట వినిపిస్తోంది.