Begin typing your search above and press return to search.

తెలంగాణలో రెక్కలు.. ఏపీలో డౌన్

By:  Tupaki Desk   |   4 July 2019 4:11 AM GMT
తెలంగాణలో రెక్కలు.. ఏపీలో డౌన్
X
వాన కోసం ఆకాశం వైపు.. ఆకలేస్తే భూమి వైపు చూసే రైతన్నలు ఒకప్పుడు తెలంగాణలో ఉండేవారు. ముఖ్యంగా వానలు పడితేనే సాగు చేసే మెట్టప్రాంత రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కాల్వలు - ప్రాజెక్టులు లేని కరీంనగర్ పూర్వపు జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం పూర్తిగా మెట్టప్రాంతం. ఇక్కడ పోయినేడాది వరకు ఎకరాకు 3 లక్షలు మాత్రమే పలికేది. కానీ ఇప్పుడు అది 12 లక్షలు ఎకరాకు అయ్యింది. ఏంటీ మతలబు అంటే..? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తోటపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ నియోజకవర్గానికి కాలువ వస్తోంది. నీటిని తెస్తోంది. పెద్ద చెరువులను నింపుతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చందుర్తి రైతుకు పదెకరాల భూమి ఉంది. అందులో నీటి వసతితో పండేది కేవలం 4 ఎకరాలే.. మిగతా అంతే బీడు భూమి.. వానలు బాగా పడితే పత్తి వేస్తారు.. పండిస్తారు. అయితే అతడికి కేసీఆర్ సర్కారు ఎకరాకు రూ.5వేల చొప్పున పదెకరాలకు 50 వేలు చెల్లిస్తోంది. దీంతో సాగు చేయని రైతు ఖాతాల్లో 50వేలు అంటే మాటలు కాదు కదా.. ఇలా భూమి ఉన్న రైతుల పంట ఇలా పండుతోంది.

మెట్టప్రాంతమైన ఈ నియోజకవర్గాలే కాదు.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ కెనాల్స్ - బ్యారేజీలు - చెరువుల నింపే కాలవులను అనుసంధానం చేశారు. వాన పడడమే ఆలస్యం ఒడిసిపట్టి ఎత్తిపోసి వీటిని నింపడమే. అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏ రైతు తన భూమిని తెగనమ్ముకోవడం లేదు. పైగా కేసీఆర్ సర్కారు రైతుబంధు పేరిట ఎకరానికి సంవత్సరానికి 10వేలు - ప్రధాని మోడీ రూ.6వేలు ఇస్తున్నాడాయే.. పంట పండినా పండకపోయినా ఇవి రైతుల కరువు తీరుస్తున్నాయి. ఇక వానలు పడి కేసీఆర్ నీళ్లు ఇస్తే ఆ భూమి బంగారమే.

అందుకే ఇప్పుడు కరువు తీర్చే కాళేశ్వరం నీటి జాడ - రైతుబంధు - పీఎం కిసాన్ వంటి పథకాలతో తెలంగాణలో భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రెక్కలు విప్పుకుంది. భూములకు విపరీతమైన ధర పలుకుతోంది. ఇక తెలంగాణలో బాగా డబ్బు సంపాదించిన వాళ్లు - బడా రైతులంతా భూముల కోసం ఎంతైనా వెచ్చించడానికి రెడీ అవుతున్నారు. దీని పర్యవసానంగా హైదరాబాద్ లో నివాసం ఉండడానికి.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంతోపాటు హైదరాబాద్ లో భారీగా రియల్ భూం కూడా పెరిగింది. ఇక ఏపీలో ఉండే వాళ్లు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులకు ఎగబడుతున్నారట..

తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమ్ నడుస్తుంటే.. ఏపీలో మాత్రం సీన్ రివర్స్ గా మారింది. ఏపీ సీఎంగా జగన్ రావడం.. అమరావతిలో టీడీపీ భూములపై విచారణకు చేపట్టడం.. టీడీపీ ప్రభుత్వం కట్టిన అక్రమనిర్మాణాలను కూల్చివేస్తుండడంతో రియల్ భూమ్ ఒక్కసారిగా పడిపోయింది. ఏపీలో పెట్టుబడులకు - ఇక భూములు కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నారు. ఇక ఏపీలో ప్రభుత్వం మారడం.. దాని విధానం ఇంకా ఖరారు కాకపోవడం.. పరిశ్రమల విషయంలో ఎలాంటి స్టెప్ కూడా తీసుకోకపోవడంతో కొత్తగా పరిశ్రమలు కూడా రావడం లేదు.

మొత్తంగా తెలంగాణకు - ఏపీకి ఇప్పుడు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు - రైతుబంధు వాటి వల్ల తెలంగాణలో భూములకు రెక్కలు రాగా.. ఏపీలో ప్రభుత్వం మారడం.. కఠిన చర్యల వల్ల భూమ్ పడిపోతోంది. మరి ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తున్నది వేచిచూడాలి.