Begin typing your search above and press return to search.

రాజధానిలో రియల్ భూమ్

By:  Tupaki Desk   |   12 July 2015 11:40 PM IST
రాజధానిలో రియల్ భూమ్
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అంటే తెలియదు. ప్రతి ఒక్కరూ ఇళ్లు కట్టుకునేవారు. అక్కడ రెండు మూడు అంతస్తులు కడితే గొప్ప. ఇక విజయవాడలో నిన్న మొన్నటి వరకు అపార్టుమెంట్లు ఉన్నా.. హైదరాబాద్ తో పోలిస్తే అవన్నీ చిన్న చిన్న అపార్టుమెంట్లే. ఒక్క దానిలో 20, 30 ఫ్లాట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారుతోంది. పెద్ద అపార్టుమెంట్లు, అపార్టుమెంట్ సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు తదితరాలన్నీ అక్కడికి వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు హైదరాబాద్లో వెలసిన రియల్ కోణాలన్నీ ఇప్పుడు విజయవాడకు బదిలీ అవుతున్నాయి.

విజయవాడలో గేటెడ్ కమ్యూనిటీలకు పోరంకిలో శ్రీకారం చుట్టుకుంది. విజయవాడ శివార్లలోని పోరంకి పరిధిలో ఒక సంస్థ మూడెకరాల్లో వందకుపైగా ఫ్లాట్లు, కొన్ని విల్లాలతో గేటెడ్ కమ్యూనిటీని ప్రారంభించింది. ఆ తర్వాత కానూరులో మరో సంస్థ నాలుగు ఎకరాల్లో 225 ఫ్లాట్లతో మరొక భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాన్ని చేపట్టింది. వీటికి అనూహ్య స్పందన వస్తోంది. దాంతో పలు ఇతరరియల్ సంస్థలు కూడా గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు వెయ్యి గజాల విస్తీర్ణంలో విజయవాడలో అపార్టుమెంటు అంటే చాలా పెద్దది అన్నమాట. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారింది. 3000, 4000 గజాల వరకూ విస్తీర్ణంలో అపార్టుమెంట్లను కాకుండా అపార్టుమెంటు సముదాయాలను నిర్మిస్తున్నారు. నగరానికి అన్ని వైపులా గ్రామాల్లో వీటి నిర్మాణం సాగుతోంది. మరీ ముఖ్యంగా కానూరు, పోరంకి, తాడిగడప, పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, నిడమానూరు, రామవరప్పాడు, గొల్లపల్లి, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం తదితర గ్రామాల్లో ఎకరం ఆపై విస్తీర్ణంలో అపార్టుమెంటు సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మిస్తున్నారు. రాజధాని ప్రాంతానికి ఇప్పుడే రియల్ కళ వచ్చేస్తోందన్నమాట.