Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మళ్లీ భూంభూం షకలక

By:  Tupaki Desk   |   20 Feb 2016 7:21 AM GMT
హైదరాబాద్ లో మళ్లీ భూంభూం షకలక
X
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కోలుకుందని చెప్పుకోవాలి. గత మూణ్నాలుగేళ్లలో కుదుపులకు లోనయిన ఈ రంగం ఇప్పుడు రాజకీయ సుస్థిరత, అభివృద్ధి ప్రాజెక్టుల రాకతో బాగా కోలుకుంది.

రాష్ట్ర విభజన అంశం కొంతకాలం స్థిరాస్తి మార్కెట్‌ను ఒడిదొడుకులకు గురిచేసింది. రాష్ట్ర విభజన, కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, సుస్థిర పాలన దిశగా సాగుతుండటం, అభివృద్ధికి శరవేగంగా బాటలు వేస్తుండటంతో ఈ రంగంలో తిరిగి హుషారు మొదలైంది. మునుపు ఉన్నంత వేగం లేకపోయినా స్థిరత్వమైతే సాధించింది. మరో ఆర్నెళ్లలో భారీ రియల్ బూమ్ వస్తుందని ఆ రంగంలో నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే విధానాలు అమలు చేస్తుండడంతో పరిశ్రమలు ఏర్పాటు... ఐటీ రంగం మరింతగా పుంజుకుంటుండడం... విమానయాన, ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాల పరిశ్రమలు రానుండడం వంటివన్నీ రియల్ రంగాన్ని గాడిలో పెట్టేశాయి. హైదరాబాద్‌ లో గృహ - కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరిగిందని... స్థిరాస్తిలో పెట్టుబడులకు హైదరాబాద్‌ ఆకర్షణీయమని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆర్నెళ్లలో భూముల ధరలకు మళ్లీ రెక్కలొస్తాయని పరిశ్రమవర్గాలు అంచనావేస్తున్నాయి. ఇప్పుడే స్థలాలు కొనిపెట్టుకున్నవారికి అప్పుడు లాభాల పంటే అని అంటున్నారు.