Begin typing your search above and press return to search.

ఈ తెలివి కేంద్రానికి ఎందుకు లేనట్లు? రూ.100 కోట్లకు 'విరాట్' సేల్

By:  Tupaki Desk   |   2 Oct 2020 10:00 AM IST
ఈ తెలివి కేంద్రానికి ఎందుకు లేనట్లు? రూ.100 కోట్లకు విరాట్ సేల్
X
సుదీర్ఘకాలం భారత్ నౌకాదళాలకు సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విమాన వాహక నౌక ‘విరాట్’ గుర్తుందిగా. దానికి సంబంధించిన ఒక విషయం విన్నంతనే విస్మయం.. అంతనే కొత్త సందేహాల్ని కలిగిస్తాయి. ఈ జులైలో విరాట్ ను తుక్కు కింద మార్చేందుకు వీలుగా శ్రీరామ్ గ్రూపు సంస్థకు రూ.38.54 కోట్ల మొత్తానికి కేంద్రం అమ్మేయటం తెలిసిందే. దాదాపు ముప్ఫై మూడేళ్లు (1987-2020) వరకు సేవలు అందించిన ఈ భారీ నౌకను తుక్కు కింద మార్చటం తప్పించి మరో అవకాశమే లేదని తేల్చారు.

విచిత్రంగా శ్రీరామ్ గ్రూప్ సంస్థ చేతికి విరాట్ వెళ్లినంతనే ముంబయికి చెందిన ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ అనే సంస్థ ఈ నౌకను కొనుగోలు చేయటానికి ఆసక్తిని ప్రదర్శించింది. ఆ వెంటనే ప్రయత్నాలు చేసింది. మామూలుగా అయితే రూ.125 కోట్లకు శ్రీరామ్ గ్రూపు సంస్థ అమ్మాలనుకుంది కానీ.. ఎన్విటెక్ సంస్థ విశాల భావాల్ని అర్థం చేసుకొని రూ.100 కోట్లకు ఓకే చెప్పేసిందట.

ఇంతకూ విరాట్ ను ఎన్విటెక్ ఏం చేయనుందన్న విషయానికి వస్తే.. ఆ సంస్థ ఆలోచన ఏమంటే.. విరాట్ లాంటి విశిష్ఠ నౌకను.. ఘన చరిత్ర ఉన్న నౌకను చెత్త కింద మార్చే బదులు.. దాన్ని మ్యూజియంగా మారిస్తే బాగుంటుంది కదా? అన్న ఆలోచనకు వచ్చింది. ఇదే విషయాన్ని శ్రీరామ్ గ్రూపునకు తెలిపి..భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఎన్విటెక్ సంస్థ ఆలోచనకు గోవా ప్రభుత్వం తమకు చేతనైనంత తోడ్పాటును అందించేందుకు సిద్ధంగా ఉందట.

విరాట్ ను అమ్మే సమయంలో శ్రీరామ్ సంస్థతో కేంద్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రీసేల్ చేసే ఆలోచన ఉంటే.. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రాన్ని తీసుకోవాలన్న కండీషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్విటెక్ సంస్థ ఎన్ ఓసీ తీసుకురావాలని.. అప్పుడు మాత్రమే తాము అమ్ముతామని శ్రీరామ్ సంస్థ చెబుతోంది. ఈ దిశగా ఎన్విటెక్ సంస్థ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూసినప్పుడు వచ్చే సందేహాలకు కొదవ ఉండదు. జూన్ లో రూ.38.54 కోట్లు పెట్టి కొన్న విరాట్ అక్టోబరు వచ్చేసరికి రూ.100 కోట్లు పలకటం ఏమిటి? మ్యూజియం చేయాలన్న ఆలోచన ఒక సంస్థకు వచ్చే బదులు.. రక్షణ మంత్రిత్వ శాఖకు ఎందుకు రాలేదు? రీసేల్ వేళ.. భారీ లాభం కళ్లచూసే అవకాశం ఉన్న శ్రీరామ్ గ్రూపు విరాట్ ను అమ్మే వేళ.. ఎంత బెట్టును ప్రదర్శిస్తుందన్న విషయం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తికర చర్చగా మారిందని చెప్పక తప్పదు. ఏమైనా వంద కోట్లకు పైగా ధర పలికే విరాట్ ను రూ.38 కోట్లకే కేంద్రం ఎందుకు విక్రయించినట్లు? ఎన్విటెక్ కు వచ్చిన ఆలోచన కేంద్రానికి ఎందుకు రానట్లు? అన్న ప్రశ్నలకు సమాధానం లభించేదెప్పుడు?