Begin typing your search above and press return to search.

వారెవ్వా..యంగ్ ఢిల్లీ దుమ్ము దుమారం..కోహ్లీకి మళ్లీ నిరాశే

By:  Tupaki Desk   |   6 Oct 2020 12:34 AM IST
వారెవ్వా..యంగ్ ఢిల్లీ దుమ్ము దుమారం..కోహ్లీకి మళ్లీ నిరాశే
X
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో యువ ఢిల్లీ దుమ్ము దుమారం రేపుతోంది. వరుసగా భారీ స్కోర్లు సాధిస్తూ విజయాలు కైవసం చేసుకుంటోంది. దాదాపు అందరూ యంగ్ ప్లేయర్స్ ఉన్న ఢిల్లీ జట్టు కొన్నేళ్లలో ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తోంది. పెద్ద జట్లకు షాకులు ఇస్తోంది. సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసు లోకి దూసుకెళ్లింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చక్కటి ఫామ్ కొనసాగిస్తూ పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు)లతో చెలరేగాడు. శిఖర్‌ ధావన్‌(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌)లు రాణించారు. స్టోయినిస్‌ మెరుపు బ్యాటింగ్ ( 53 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తో దుమ్ము రేపాడు. స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మ్యాచ్ లో అతడి ఆటే హైలెట్.

197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఒక్క విరాట్‌ కోహ్లి(43; 39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) తప్ప మిగతా అంతా అలా వచ్చి ఇలా పెవిలియన్ బాట పట్టారు. పవర్‌ప్లేలోనే దేవదత్‌ పడిక్కల్‌ (4), అరోన్‌ ఫించ్‌ (13), డివిలియర్స్‌ (9) వికెట్లను కోల్పోయారు. మొయిన్‌ అలీ(11) శివం దూబే(11) స్వల్ఫ స్కోర్‌కే పరిమితం కావడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే చాప చుట్టేశారు.


ఢిల్లీ బౌలర్ల పంజా

ఛేదనలో బెంగళూరు జట్టుకు ఢిల్లీ బౌలర్లు హడలెత్తించారు.కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో ఆర్సీబీకి పరుగులు చేయడానికి కష్టమైంది. రబడా నాలుగు వికెట్లు సాధించగా, అక్షర్‌ పటేల్‌, నోర్త్‌జేలు తలో రెండు వికెట్లు తీశారు. అశ్విన్‌ కు ఒక వికెట్‌ దక్కింది. అక్షర్ పటేల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.

అశ్విన్ అంతలోనే ఎంత మారే

గతేడాది జరిగిన ఐపీఎల్‌ లో రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ బట్లర్‌ ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేసి అశ్విన్‌ వివాదం సృష్టించాడు. అప్పుడు అతడు పంజాబ్‌ కెప్టెన్‌. ఈ ఏడాది అశ్విన్‌ ఫ్రాంచైజీ మారింది. అందుకే మనసు కూడా మారిందేమో. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌.. మన్కడింగ్‌ ఛాన్స్ వచ్చినా వదిలేశాడు. కేవలం వార్నింగ్‌ ఇచ్చాడు. అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా నాన్‌ స్టైకింగ్‌ ఎండ్‌ లో ఉన్న ఫించ్‌ క్రీజ్‌ను దాటి కొంత దూరం వెళ్లాడు. కానీ అశ్విన్‌ మన్కడింగ్‌ కు ప్రయత్నించ లేదు. బంతిని వేయడం ఆపేసి ఫించ్‌ కు మర్యాద గా వార్నింగ్‌ ఇచ్చాడు.

విరాట్ మరో రికార్డు

విరాట్ కోహ్లీ టీ20ల్లో మరో రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీతో మ్యాచ్ లో విరాట్ పది పరుగులు చేయగానే టీ20ల్లో 9 వేల రన్స్ మైలురాయిని చేరుకున్నాడు. దీంతో టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ సాధించాడు.ప్రపంచ వ్యాప్తంగా టీ20ల్లో 9 వేల రన్స్ చేసిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

కోహ్లీ అత్యధిక మ్యాచ్ ల ప్రపంచ రికార్డు

టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుకు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా విరాట్‌ రికార్డు నెలకొల్పాడు. బెంగళూరు తరఫున విరాట్ 197వ మ్యాచ్‌ ఆడాడు. దీంతో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ హిల్డ్రెత్‌ను కోహ్లీ అధిగమించాడు. సోమర్‌సెట్ తరఫున హిల్డ్రెత్‌ 196 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. హిల్డెత్‌ తర్వాత ఎంఎస్ ధోనీ, సమిత్ పటేల్ మూడో స్థానంలో ఉన్నారు.

ఊతప్పలా..బంతికి లాలాజలం పూసిన కోహ్లీ

కరోనా నేపథ్యంలో బాల్ కు లాలాజలం పూయడం ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఊతప్ప బంతికి లాలాజలం పూసి వివాదంలో ఉండగా ఢిల్లీతో మ్యాచ్ లో పృథ్వీ షా కొట్టగా బాల్ ను అడ్డుకున్న కోహ్లీ బంతికి ఉమ్మి పూశాడు. అయితే వెంటనే పొరపాటు చేసినట్లు గ్రహించి నవ్వుతూ చేతులు పైకెత్తి సంజ్ఞలు చేశాడు.