Begin typing your search above and press return to search.

ఈఎంఐలు, లోన్ల పేమెంట్లపై ఆర్బీఐ గుడ్ న్యూస్?

By:  Tupaki Desk   |   25 March 2020 3:30 PM GMT
ఈఎంఐలు, లోన్ల పేమెంట్లపై ఆర్బీఐ గుడ్ న్యూస్?
X
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడ్డ దేశాలలోని ప్రజల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ విధించిన దేశాలలో జనజీవనం స్తంభించిపోయింది. నోట్ల రద్దు తరహాలో ఉన్నపళంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ఎక్కడి ప్రజలు అక్కడ ఇరుక్కుపోయారు. ప్రత్యేకించి కరోనా...దాదాపుగా అందరి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. లాక్ డౌన్ సమయంలో చాలామంది ఇళ్లలో లాక్ అయిపోయారు. వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్న కొందరిని, పెయిడ్ లీవ్స్ ఇచ్చిన కంపెనీలలో పనిచేసేవారిని...కరోనాకు ముందులాగా నెలవారీ సంపాదనకు ఢోకాలేనివారిని మినహాయిస్తే...మిగతా వారి కుటుంబాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నట్లే. ఇక, దినసరి కూలీలు, రోజువారీ వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, తోపుడు బండ్ల వారి పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యావసరాలు...పొరపాటు కరోనా సోకితే అత్యావసరాల కోసం డబ్బు దొరకడం గగనం. ఇటువంటి సమయంలో బ్యాంకు లోన్లు, ఈఎంఐలు కట్టే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పోసప్పో చేసి కడదామనే పరిస్థితి లేదు...ఎందుకంటే దాదాపుగా కరోనా కంపు పోయేవరు అందరూ తమకున్నదాంట్లో నుంచి దానం చేయడానికి పెద్దగా ఇష్టపడకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈఎంఐలు, బ్యాంకు లోన్ల చెల్లింపులో వెసులుబాటు కల్పిస్తే బాగుండనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోన్లు, ఈఎంఐల పేమెంట్ల విషయంలో ఆర్బీఐ తీపి కబురు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పేమెంట్లు లేటయినా....ఎటువంటి ఫైన్లు, అధిక చెల్లింపులు లేకుండా స్వీకరించేలా ఆయా బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలివ్వనున్నట్లు అధికారుల అనధికారికంగా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.

కరోనాను కట్టడి చేసే క్రమంలో విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ దేశంలోని మెజారిటీ ప్రజలపై పడింది. లాక్ డౌన్ ప్ర‌భావంతో దేశంలో సామాజికంగా, ఆర్థికంగా విప‌త్క‌ర ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా, లాక్ డౌన్ ల దెబ్బకు అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ముఖ్యంగా పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి వర్గాలకు చెందిన 80 శాతం మంది ప్రజల వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు తీవ్ర అంత‌రాయం కలిగింది. ఆ కేటగిరీ ప్రజల్లో ఎక్కువమంది చెల్లించే బ్యాంకు లోన్స్, ఈఎంఐల విష‌యంలో సందిగ్దత ఏర్పడింది. వాటి పేమెంట్లు ఆల‌స్య‌మైనా అనుమ‌తులు ఇచ్చే విధంగా ఆర్బీఐ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈఎంఐలు, ఇత‌ర చెల్లింపుల లేటయినా ఎటువంటి అధిక చెల్లింపులు లేకుండా ఆర్బీఐ కీల‌క ఆదేశాలు ఇవ్వ‌బోతున్న‌ట్టు అధికారిక వ‌ర్గాలు సూత్రప్రాయంగా వెల్ల‌డించాయి. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో ఆర్బీఐ ఆ తరహా వెసులుబాటు కలిగిస్తే చాలామందికి ఉప‌శ‌మ‌నం క‌లిగే అవ‌కాశం ఉంది. కాగా, ఇప్ప‌టికే లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఏటీఎంల లో విత్ డ్రాయల్స్ వంటి పలు అంశాలలో ఉపశమనం కల్గించిన సంగతి తెలిసిందే.