Begin typing your search above and press return to search.

ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ

By:  Tupaki Desk   |   6 Aug 2022 10:08 AM IST
ఎన్నారైలకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ
X
ప్రవాస భారతీయులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవాస భారతీయులు త్వరలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) సహాయంతో దేశంలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బిల్లులను చెల్లించేలా ఆర్బీఐ ఈ వెసులుబాటు కల్పించింది. భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన ఎన్నారైలు ఇక్కడికి డబ్బులు పంపడం.. తమ వారి అవసరాలు తీర్చే విషయంలో ఇబ్బందులు పడడాన్ని కేంద్రం గుర్తించింది. అందుకే విదేశాల్లో ఉండి భారత్ లోని తమ వారి సౌకర్యాల కోసం డైరెక్టుగా చెల్లించేలా ఈ వెసులుబాటు తీసుకొచ్చింది.

ఎన్నారైలు భారత్ లోని వారి కుటుంబ సభ్యుల తరుఫున బీబీపీఎస్ ద్వారా విద్యుత్, నీరు, పాఠశాల, కళాశాల ఫీజు వంటి సౌకర్యాల కోసం చెల్లించడానికి వీలు కలుగుతుంది. భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ అనేది బిల్ చెల్లింపు సమగ్ర వ్యవస్థగా తీర్చిదిద్దారు.

ఎన్నారైలు పరాయి దేశంలో ఉండే ఈ ఆన్ లైన్ బిల్లు చెల్లింపు సేవను పొందవచ్చు. ఇది బిల్లు చెల్లింపు కోసం ఇంటర్ ఆపరబుల్ ఫ్లాట్ పారమ్. ఈ వ్యవస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కింద పనిచేస్తుంది. దాదాపు 20,000 బిల్లింగ్ యూనిట్లు బీబీపీఎస్ కు అనుసంధానించబడ్డాయి.

ఈ సిస్టమ్ లో నెలవారీ ప్రాతిపదికన 80 మిలియన్ల లావాదేవీలు ఉన్నాయి. బీబీపీఎస్ భారతదేశంలోని వినియోగదారుల బిల్లు చెల్లింపు అనుభవాన్ని మార్చిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు.

సరిహద్దుల అవతల ఉన్న వారు కూడా ఈ బిల్లు చెల్లింపు విధానాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీంతో భారతదేశంలోని వారి కుటుంబాల తరుఫున ఎన్నారైలు విద్యుత్, నీటి బిల్లులు చెల్లించే వీలు కల్పించారు. దీంతోపాటు విద్యకు సంబంధించిన ఫీజులను కూడా చెల్లించగలరని తెలిపింది.

ఈ నిర్ణయంతో బీబీపీఎస్ ఫ్లాట్ ఫారమ్ కు అనుసంధానించబడిన ఇతర బిల్లింగ్ యూనిట్ల బిల్లులను కూడా చెల్లించవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. దీనికి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ త్వరలో అవరమైన సూచనలను జారీ చేస్తుంది.