Begin typing your search above and press return to search.

మార‌టోరియం ఎలా? ఈఎంఐ చెల్లించ‌క‌పోతే వ‌డ్డీ ఉంటుందా..ఉండ‌దా..?

By:  Tupaki Desk   |   22 May 2020 11:30 PM GMT
మార‌టోరియం ఎలా? ఈఎంఐ చెల్లించ‌క‌పోతే వ‌డ్డీ ఉంటుందా..ఉండ‌దా..?
X
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌లి దేశ‌మంతా స్తంభించిన స‌మ‌యంలో ప్ర‌జ‌లంతా ఆదాయ మార్గాలు కోల్పోయారు. ఈ స‌మ‌యంలో తిన‌డానికి క‌ష్ట‌మైన స్థితిలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించి ఈఎంఐలు చెల్లించ‌వ‌ద్ద‌ని మొద‌ట మూడు నెల‌లు చెప్పింది. ఇప్పుడు మరో మూడు నెలల పాటు మారటోరియం పొడిగించింది. ఈఎంఐలపై ఆగస్టు 31వ తేదీ వరకు మారటోరియాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మొద‌టి మార‌టోరియం మార్చి1 నుంచి మే 31వ తేదీ వరకు విధించిన విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కారు, ఇల్లు, ఇంట్లోని వ‌స్తువులు వాయిదాల మీద కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డులు, రుణాలు ఇచ్చే సంస్థ‌లతో తీసుకుని త‌మ అవ‌స‌రాలు తీర్చుకుంటూనే నెల‌కు వాయిదాలు చెల్లిస్తుంటారు. అయితే అక‌స్మాత్తుగా ఉప‌ద్ర‌వం వైర‌స్‌ తో వ‌చ్చ‌ ప‌డింది. లాక్‌ డౌన్ విధించ‌డంతో ఆదాయం కోల్పోయి వాటిని చెల్లించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితుల్లో అంద‌రి విష‌యాలు గ్ర‌హించిన ఆర్బీఐ మారటోరియం విధించింది. అయితే మార‌టోరియం కేవ‌లం ఫైనాన్స్ సంస్థ‌లు - బ్యాంక్‌ లు - రుణాలు ఇచ్చిన వారిని కొన్నాళ్లు ఆగండి అని ఆదేశించ‌డం మాత్ర‌మే. లాక్‌ డౌన్‌ కారణంగా ఆదాయం కోల్పోయిన వారు ఈ మారటోరియం ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. కారు‌ - గృహ రుణాలు వంటివి తీసుకున్నవారికి కొంత వెసులుబాటు లభిస్తుంది.

వాస్త‌వంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు క్రమ పద్ధతిలో వాయిదా చెల్లించాల్సిందే. వాయిదా చెల్లించక‌పోతే ఖాతాదారుపై క‌ఠిన చర్యలు తీసుకుంటాయి. దీంతోపాటు ఖాతాదారు క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో వారికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. బుల్లెట్ రీ పేమెంట్స్‌ - ఈక్వెటెడ్‌ మంత్లీ ఇన్‌ స్టాల్‌ మెంట్స్‌ - క్రెడిట్‌ కార్డ్ వాయిదాలు వంటి వాటిపై మారటోరియం ఉంది. దీన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు.

అయితే మార‌టోరియం విధించినా వ‌డ్డీ ప‌డ‌డం మాత్రం ఆగ‌దు. ఎందుకంటే మారటోరియంలో ఈఎంఐలు చెల్లించక పోతే ఆ నెల ఈఎంఐలో కట్టాల్సిన వడ్డీ మాత్రం తరువాతి నెలలో మొత్తం రుణంపై పడుతుంది. వాయిదా చెల్లించ‌క‌పోతే ప్రతినెలా ప్రిన్స్‌ పల్‌ మొత్తంపై వడ్డీ వేస్తారు. మారటోరియం ముగిశాక చెల్లించే ఈఎంఐలో ఈ వడ్డీ అదనంగా చేరుతుంది. ఎటు తిరిగినా ప్ర‌జ‌ల‌కు వ‌డ్డీభారం త‌ప్ప‌దు. మార‌టోరియం మాత్రం కొంత ఉప‌శ‌మ‌నం. వీట‌న్నిటిని గ్ర‌హించి అత్యవసరమైతేనే మారటోరియం తీసుకోవాలని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. చెల్లించే స్థోమ‌త ఉంటే వాయిదాలు చెల్లించ‌డ‌మే మంచిద‌ని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటే మార‌టోరియం కొంత మేలు చేస్తుంది. ఈ వెసులుబాటు అత్యావ‌స‌రానికి మాత్ర‌మే. మారటోరియం తీసుకోకుండా క్రెడిట్‌ - సిబిల్‌ స్కోరులను కాపాడుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.