Begin typing your search above and press return to search.

దండం పెడతాం డబ్బులివ్వొద్దు !

By:  Tupaki Desk   |   10 April 2020 11:30 PM GMT
దండం పెడతాం డబ్బులివ్వొద్దు !
X
భలేవాడివి బాసూ... ఈ లోకంలో డబ్బులు ఎవడైనా ఇవ్వొద్దంటాడా? అని పెదవి విరుస్తున్నారా... అవును డబ్బులు ఇవ్వొద్దు - డబ్బులు బదిలీ చేయండి. ఇపుడు నోట్ల కట్ట వైరస్ కట్టతో సమానం అంటూ ప్రభుత్వం - ఆర్బీఐ పేర్కొంటున్నాయి. ప్రపంచానికి ఎంత ముప్పు వచ్చినా మనం నిత్యావసరాలు కొనుగోలు చేయకుండా ఉండలేం. వాటికి డబ్బును వాడకుండా ఉండలేం. ఈ క్రమంలో నోట్లు చేతులు మారుతుంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఆర్బీఐ భారతీయులను హెచ్చరించింది.

కరోనా ఎలాంటి ఉపరితంలపైన అయినా నివసించగలదు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో నోట్లు, -నాణాలు ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్ల మీదే ఆధారపడండి. నిత్యావసరాలకు అయినా, ఇంక దేనికి అయినా ఎట్టి పరిస్థితుల్లోను డిజిటల్ పేమెంట్లు వాడటం శ్రేయస్కరం అంటోంది ఆర్బీఐ.

నోట్ల రద్దు సమయంలో చిరు వ్యాపారులు, -బళ్ల మీద కూరగాయలు పళ్లు అమ్మే వ్యాపారులు చాలామంది ఉపాధి కోల్పోయారు. అపుడింకా డిజిటల్ పేమెంట్లు సామాన్యులకు చేరలేదు. ఆ తర్వాత మళ్లీ నోట్లు పెద్ద ఎత్తున చలామణిలోకి రావడంతో అందరూ కుదుట పడ్డారు. మళ్లీ ఇపుడు కరోనా కారణంగా చిరు వ్యాపారాలు - తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసే వారి పరిస్థితి మరోసారి ఘోరంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. వీరిలో చాలామందికి డిజిటల్ పేమెంట్లు తీసుకోవడం తెలియదు. దీంతో జనం నోట్ల ద్వారా వచ్చే కరోనాను అడ్డుకోవడానికి సూపర్ మార్కెట్లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే... పల్లెలు - గూడేల్లో ఇది కష్టసాధ్యం. అందుకే వీలైనంత వరకు నోట్లను ఇస్త్రీ చేసి ఇతర నోట్లతో కలపకుండా ఉంచడం, నాణాలను కడగడం ద్వారా కరోనాను చాలా వరకు అడ్డుకోవచ్చు. లావాదేవీల అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోండి.