Begin typing your search above and press return to search.

బ్యాంకుల్ని ప‌రేషాన్ చేస్తున్న 3.80ల‌క్ష‌ల కోట్లు?

By:  Tupaki Desk   |   27 Aug 2018 4:14 AM GMT
బ్యాంకుల్ని ప‌రేషాన్ చేస్తున్న 3.80ల‌క్ష‌ల కోట్లు?
X
సామాన్యుల‌కు ల‌క్ష రూపాయిల రుణాన్ని ఇవ్వాలంటే చుక్క‌లు చూపించే బ్యాంకులు.. కేవ‌లం 70 సంస్థ‌ల‌కు ఇచ్చిన రుణం ఏకంగా రూ.3.80 ల‌క్ష‌ల కోట్లు. అది కూడా మొండి బ‌కాయిల కింద ఉన్న మొత్తం. ఇంత భారీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొనేలా బ్యాంకులు ఎందుకు వ్య‌వ‌హ‌రించాయ‌న్న‌ది ఎంత‌కూ అర్థం కాని ప‌రిస్థితి.

ప‌రిమితికి మించి రూపాయి ఇవ్వ‌టానికి స‌సేమిరా అనే బ్యాంకులు.. కార్పొరేట్ కంపెనీల‌కు ఇంత ఉదారంగా రుణాల్ని ఎలా ఇవ్వ‌గ‌లిగారు? అన్న ప్ర‌శ్న‌కు ఎంత‌కూ స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉండ‌గా.. ఈ మొండి బ‌కాయిల్ని తిరిగి వ‌సూలు చేసుకునేందుకు బ్యాంకుల‌కు రిజ‌ర్వ్ బ్యాంకు ఇచ్చిన గ‌డువు సోమ‌వారంతో ముగియ‌నుంది.

మ‌రి.. వాటి విష‌యంలో ఆర్ బీఐ ఏం చేయ‌నుంది? అన్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రుణాలు తీసుకొని తిరిగి చెల్లించే విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 70 శాతాల‌కు సంబంధించి ఆర్నెల్ల‌లో ప‌రిష్కారం చూడాల‌ని బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఒక‌వేళ గ‌డువు పూర్తి అయ్యే లోపు మొండిబ‌కాయిలు వ‌సూలు కాని ప‌క్షంలో ఆయా ఖ‌తాదారుల మీద నేష‌న‌ల్ కంపెనీ లా ట్రైబ్యున‌ల్ ద్వారా దివాళా ప్ర‌క్రియను షురూ చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ అదే జ‌రిగితే త‌మ‌కు రావాల్సిన మొత్తంలో భారీ కోత ప‌డ‌ట‌మే కాదు.. ఇమేజ్ ప‌రంగా భారీ న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నాయి. మొండిబ‌కాయిల ఖాతాలో చూపించే మొత్తంతో బ్యాలెన్స్ షీట్ ను స‌ర్దుబాటు చేస్తున్నా.. ఇక లెక్క సెటిల్ చేసే స‌మ‌యంలో.. భారీగా న‌ష్ట‌పోయే మొత్తాల‌కు ఆయా బ్యాంకులు స‌మాధానం చెప్పాల్సిన ప‌రిస్థితుల్లోకి వెళ‌తాయి. అదే జ‌రిగితే.. దానికి బ్యాంకులు ఎలా బ‌దులు చెబుతాయి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

మొండి బ‌కాయిలున్న కంపెనీల్లో అత్య‌ధికం విద్యుత్ ఉత్ప‌త్తి కంపెనీల‌తో పాటు కొన్ని టెలికం కంపెనీలు ఉన్నాయి. తుది గ‌డువు నాటికి వీటి స‌మాధానం ఏం ఉంటుంద‌న్నదే అస‌లు ప్ర‌శ్న‌. ఏమైనా.. మొండిబ‌కాయిల వ‌సూలు విష‌యంలో బ్యాంకులు అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్నాయ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.