Begin typing your search above and press return to search.

ఎస్ బ్యాంక్ డిపాజిటర్లకి ఆర్బీఐ భరోసా..!

By:  Tupaki Desk   |   7 March 2020 10:00 PM IST
ఎస్ బ్యాంక్ డిపాజిటర్లకి ఆర్బీఐ భరోసా..!
X
దేశంలోని నాలుగో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్ YES Bank భవిష్యత్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. బ్యాంకును ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే బ్యాంకుకపై నెలరోజుల పాటు ఆంక్షలు విధించింది. 30 రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్‌ విత్‌ డ్రాలపై పరిమితి పెట్టింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.

ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రైవేట్ రుణదాతను పునరుద్ధరించడానికి సెంట్రల్ బ్యాంక్ త్వరలో వేగంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎస్ బ్యాంక్ పునరుద్ధరించడానికి ఒక పథకాన్ని ఆర్బిఐ త్వరలోనే అమలు చేయడం మీరంతా వేగంగా చూస్తారని అని దాస్ ఒక కార్యక్రమంలో చెప్పారు.
ఇక ఈ ఎస్ బ్యాంకు ను సంక్షోభం నుండి బయటపడేయడానికి ఆర్ బీ ఐఓ పునరుద్దీపన పథకాన్ని చేబట్టింది. ఇందులో భాగంగా ఎస్ బీ ఐ.. ఇందులో 49 శాతం వాటాను పెట్టుబడిగా పెడుతుంది.

ఎస్ బ్యాంకులో ఎలాంటి అవకతవకలు జరిగాయో సమగ్రంగా విచారించాలని, ఎవరెవరు బాధ్యులో తేల్చాలని తాము రిజర్వ్ బ్యాంకును కోరినట్టు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డ్రాఫ్ట్ ఎస్ బ్యాంక్ రీ కంస్ట్రక్షన్ స్కీమ్-2020 పేరిట ఈ పథకాన్ని ప్రకటించిన ఆర్ బీ ఐ, మూలధనం కోసం అల్లాడుతున్న ఈ బ్యాంకును ఆదుకోనున్నట్టు తెలిపింది. ఈ పథకం కింద ఈ బ్యాంక్ అధీకృత మూలధనాన్ని 5 వేల కోట్లుగా మార్చారు. ఎస్ బ్యాంక్ షేర్లు శుక్రవారం బీ ఎస్ ఈ సెన్సెక్స్ లో 56 శాతానికి దిగజారాయి. కాగా- ఇవాళ ఉదయం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్.. ఈ సంక్షోభం కేవలం ఎస్ బ్యాంకుకు మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు. కొత్త పథకం కింద ఈ బ్యాంక్ ఉద్యోగుల వేతనాల్లో ఇదివరకు మాదిరే ఎలాంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు. అయితే , ఇదే సమయంలో ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎస్ బ్యాంక్ కొత్త అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ కూడా అభయమిచ్చారు.

ఇకపోతే , ఎస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. శుక్రవారం రాత్రే ముంబైలోని ఆయన ఇంటికి చేరుకున్న వీరు.. నిర్విరామంగా సోదాల్లో బిజీ అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ‘క్విడ్ ప్రోకో’ కింద కపూర్, ఆయన భార్య భారీగా అవకతవకలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. దేవన్ హోసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ఈ బ్యాంక్ ఇఛ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడంలో ఈ భార్యాభర్తల ప్రమేయం ఉండవచ్చునని ఈడీ అంచనా వేస్తోంది. రానా కపూర్ తో బాటు ఆయన భార్య బిందును కూడా అధికారులు విచారిస్తున్నారు. దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రమోటర్లయిన కపిల్ వాధ్వాన్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ లతో జరిపిన లావాదేవీల్లో రానా కపూర్ పలు అక్రమాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు.