Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా , ఆయ‌న‌తోపాటు మ‌రో 75 మంది!

By:  Tupaki Desk   |   3 July 2022 12:41 AM GMT
ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి రాజీనామా , ఆయ‌న‌తోపాటు మ‌రో 75 మంది!
X
కోన‌సీమ జిల్లా (ఇంత‌కుముందు తూర్పుగోదావ‌రి జిల్లా) రాజోలు నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీలో మ‌రోసారి చిచ్చు రాజుకుంది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వికి మాజీ ఎమ్మెల్యే, రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయ‌న‌తోపాటు మ‌రో 75 మంది కీల‌క నేత‌లు వైఎస్సార్సీపీకి గుడ్ బై కొట్టారు. దీంతో వైఎస్సార్సీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందేన‌ని చెబుతున్నారు.

రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీలో మూడు కుంప‌ట్లు కొన‌సాగుతున్నాయి. ఒక గ్రూపుకు జ‌న‌సేన నుంచి అక్క‌డ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన రాపాక వ‌ర‌ప్రసాద‌రావు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాపాక జ‌న‌సేన నుంచి గెలిచి వైఎస్సార్సీపీతో అంట‌కాగుతున్న సంగతి తెలిసిందే. ఇక రెండో గ్రూపుకు ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెద‌పాటి అమ్మాజీ నాయ‌క‌త్వంలో కొన‌సాగుతుంద‌ని అంటున్నారు. ఇక మూడో గ్రూపుకు మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన బొంతు రాజేశ్వ‌రరావు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని చెబుతున్నారు.

అయితే నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జిగా ఉన్న త‌న‌ను కాద‌ని.. జ‌న‌సేన నుంచి వ‌చ్చిన రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని బొంతు రాజేశ్వ‌ర‌రావు ఆరోపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బొంతు రాజేశ్వ‌రరావు వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసి రాపాక‌పై ఓడిపోయారు. జ‌న‌సేన నుంచి గెలిచి వైఎస్సార్సీపీ కండువాలు క‌ప్పుకున్న తిరుగుతున్న రాపాకకే పార్టీ అధిష్టానం ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని రాజేశ్వ‌ర‌రావు విమ‌ర్శిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ప్ర‌భుత్వ‌ సలహాదారుగా ఉన్న బొంతు రాజీనామా బ‌ట్టారు.

బొంతు రాజేశ్వ‌రరావుతోపాటు మరో 75 మంది వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. మలికిపురం మండలం లక్కవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో వారంతా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కొంత కాలంగా నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయం మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు రాజేశ్వరరావు చెప్పారు. 12 ఏళ్లుగా వైకాపాను నియోజకవర్గంలో బలోపేతం చేశానని, కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, కానీ పార్టీపరంగా వారికి ఏ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన పదవితోనూ రాష్ట్రానికి, కార్యకర్తలకు ఎలాంటి ప్రయోజనం అందలేదని వాపోయారు. పార్టీ సభ్యత్వం లేని రాపాక వరప్రసాదరావుకు వైకాపా పగ్గాలు అప్పగించడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే రాజీనామా నిర్ణయానికి వచ్చానని ప్రకటించారు.

నియోజకవర్గంలో పార్టీకి జరుగుతున్న నష్టం, కార్యకర్తలకు అవమానంపై ఎన్నోసార్లు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీని బతికించాలని మొరపెట్టుకున్నా వారు కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. పైపెచ్చు జనసేన ఎమ్మెల్యేతో కలిసి వెళ్లాలని చెప్పడం దురదృష్టకరమని వాపోయారు.