Begin typing your search above and press return to search.

వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక : కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   24 Oct 2015 8:49 AM GMT
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక : కొత్త ట్విస్ట్‌
X
వరంగల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుద‌లయిన నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు పోరుకు సిద్ధం అవుతున్నాయి. పార్టీ త‌ర‌ఫున బ‌రిలో దింపే అభ్య‌ర్థులు, పొత్తులు - ఎన్నిక‌ల వ్యూహం ర‌చించేందుకు ముఖ్య‌నాయకులు భేటీ అవుతున్నారు. తాజాగా తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ కార్యాల‌యంలో సమావేశమయ్యారు. వరంగల్ ఉప‌ఎన్నిక సంద‌ర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అభ్య‌ర్థిని బ‌రిలో ఉంచాల‌ని అభిప్రాయం వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ...బీజేపీ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలో నిలుపుతామ‌ని గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆ పార్టీ నాయ‌కుడినే పోటీలో ఉంచాల‌ని, ఉమ్మ‌డిగా గెలుపు వ్యూహం రచించాల‌ని నిర్ణ‌యించారు.

అనంత‌రం పార్టీ సీనియ‌ర్ రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం అభ్యర్థిని రంగంలోనికి దింపాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నప్పటికీ...మిత్ర ధర్మం పాటించాల్సి ఉంద‌ని అన్నారు. టీడీపీ-బీజేపీ మైత్రి ప్రకారం బీజేపీ అభ్యర్థే వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటారని ప్ర‌క‌టించారు. గతంలో మెదక్‌ లోక్‌ సభ - రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బీజేపీకి మద్ధతు ఇచ్చామని చెప్పారు.అలాగే ఈ ఎన్నిక‌ల్లోనూ మిత్ర ధర్మం పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ‌లో అధికార టీఆర్‌ ఎస్ పార్టీపై ప్రజలకు ఆశలు సన్నగిల్లాయని రావుల‌ అన్నారు. ప్ర‌భుత్వం ఏ ప్ర‌జా సంక్షేమ కార్యాక్ర‌మం కూడా చేప‌ట్టడంలేద‌ని విమ‌ర్శించారు. ఓరుగ‌ల్లు ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌జ‌లు తెలంగాణ ప్ర‌భుత్వానికి స్ప‌ష్ట‌మైన సందేశం పంపిస్తార‌ని అన్నారు. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ పై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, త‌మ పార్టీ అధినేత‌ చంద్రబాబు జోడిపై నమ్మకంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని రావుల విశ్వాసం వ్యక్తం చేశారు.