Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ అంత క‌క్కుర్తి ప‌డుతోందట‌

By:  Tupaki Desk   |   15 Oct 2016 4:58 PM GMT
టీఆర్ ఎస్ అంత క‌క్కుర్తి ప‌డుతోందట‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాన‌స‌పుత్రిక ప్రాజెక్టులో కీల‌క‌మైన ఇంటింటికీ న‌ల్లానీరు అంశం ప్రారంభానికి ముందే ర‌చ్చగా మారుతోంది. న‌ల్లానీరు ఇవ్వ‌నిదే ఓట్లు అడ‌గ‌మ‌ని ధీమాగా రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ప్ప‌టికీ....ఇటీవ‌ల‌ ఇచ్చిన జీవో ఆధారంగా ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ కేసీఆర్ స‌ర్కారు తీరుపై విరుచుకుప‌డింది. సునిశిత విమ‌ర్శ‌లు చేయ‌డంలో పేరున్న టీడీపీ నాయ‌కుడు - మాజీ ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి తాజాగా ఈ కోణంలో ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

35 మున్సిపాలిటీలకు మిషన్ భ‌గీరథ ప‌థ‌కం ద్వారా తాగునీరు అందించే నిర్మాణ పనులు చేపట్టడానికి జీవో 252 విడుదల చేసినట్లుగా కేసీఆర్ సర్కారు చెప్పకోవ‌డం వింత‌గా ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఇందులో 10 మున్సిపాలిటీలకు కేంద్ర నిధులు కేటాయించబడగా మిగిలిన 25 మునిసిపాలిటీలకు ప్రభుత్వ- ప్రైవేటు ఉమ్మడి ఒప్పందం కింద పనులు చేపట్టడానికి నిర్ణయించామంటూ జీవో 252ను కేసీఆర్ సర్కారు విడుదల చేసిందని ఆయ‌న వివ‌రించారు. ఈ ప్రైవేటు భాగస్వామ్య కంపెనీ ఇంటింటికి వెళ్లి న‌ల్లా బిల్లులు వసూలు చేయబోతుండడం నిజమా?కాదా? అనే విష‌యంలో సర్కారు స్పష్టత ఇవ్వాల‌ని కోరారు. ఒక వేళ ఇవ్వకపోతే సంపన్న రాష్ట్రంలో తాగునీటికి కూడా బిల్లులు వసూలు చేసే దుస్థితి దాపురించిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. అలాంటి క‌క్కుర్తికి స‌ర్కారు చేరింద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటార‌ని రావుల వ్యాఖ్యానించారు.

సంపన్న రాష్టమని చెప్పకుంటున్న కేసీఆర్‌ సర్కారు స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనాలకు గానీ, ఉపాధి హామీకి గానీ నిధులు విదల్చకపోగా కనీసం మంచినీటికి కూడా సొమ్ములిచ్చే పరిస్థితి లేకపోవడం దారుణమ‌ని రావుల వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ సర్కారు అవలంభిస్తున్న లోప‌భూయిష్ట‌ విధానాలకు ఇదే నిదర్శనమ‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలేవైనా ప్రజలపైన భారం మోపని విధంగా ఉండాలే కానీ. లాభాపేక్షే ప్రధాన ధ్యేయంగా పనిచేయ‌వ‌ద్ద‌ని సూచించారు. ఆయా కంపెనీలతో మంచినీటి సరఫరా ఒప్పందాలపై జరిగిన ఈ ప్రక్రియను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లేదంటే తెరాస సర్కారును మంచినీరు కూడా అమ్ముకొని లాభాలుగడించే వ్యాపార సంస్థగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చ‌రించారు. అంతేకాకుండా 25 మున్సిపాలిటీలకు భారీ స్థాయిలో కుదుర్చుకున్న ఒప్పందాలను విధిగా అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం త‌ప్ప‌నిస‌రిగా ఉంద‌ని రావుల తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/