Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు ఇళ్లతో 15వేల ఇళ్లు వస్తాయట

By:  Tupaki Desk   |   19 Sep 2016 6:31 AM GMT
ఆ ముగ్గురు ఇళ్లతో 15వేల ఇళ్లు వస్తాయట
X
పేదల కోసం.. వారి సంక్షేమం కోసమే తమ సర్కారు ఉన్నట్లు ప్రభుత్వాలు చెప్పటం మామూలే. మిగిలిన ప్రభుత్వాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు మాత్రం కోటలు దాటతాయి. మాటల్లోనే బంగారు తెలంగాణను చూపించే ఆయన.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కేసీఆర్ పాలనలోని నెగిటివ్ పాయింట్స్ ను అందరికి అర్థమయ్యేలా చెప్పటంతో తెలంగాణ విపక్ష నేతలు దారుణంగా విఫలమయ్యారని చెప్పాలి.

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లకు దగ్గరగా వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఏ విషయంలోనూ స్పష్టమైన అభివృద్ధి సాధించిన దాఖలాలు కేసీఆర్ సర్కారులో కనిపించవు. గతంతో పోలిస్తే.. హైదరాబాద్ రోడ్లు ప్రస్తుతం దారుణాతి దారుణంగా మారాయి. కోటికి పైగా జనాభా ఉన్న మహానగర రోడ్లు ఈ రోజు ఎంత ప్రమాకరంగా మారాయన్నది ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టినంతనే తెలిసిపోయే పరిస్థితి.

నగరంలో రోడ్లు అనే కన్నా.. గుంతల రోడ్లు అనటం సబబుగా ఉంటుందేమో. కనుచూపు మేర గుంతలో నిండిన రోడ్లతో నగరజీవులు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. ఇదంతా ఒక ఎత్తుఅయితే వర్షం పడితే చాలు.. భారీగా చోటు చేసుకునే ట్రాఫిక్ జాంలతో లక్షలాది మంది నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా తెలంగాణ సర్కారుకు చీమ కట్టినట్లుగా లేదన్న విమర్శ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికరమైన అంశాన్ని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దుబారా ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన చెబుతూ.. అందుకు ఉదాహరణల్ని ప్రస్తావించారు. కోట్లాది రూపాయిల ఖర్చుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని కడితే.. వాస్తే లేదన్న కారణం చూపించి.. ఇప్పుడు మరో భారీ భవనాన్ని నిర్మించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తొమ్మిది ఎకరాల్లో ముఖ్యమంత్రి కోసం ఇంటిని నిర్మించటంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఒక్క ముఖ్యమంత్రికి మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. డీజీపీ నివాసాల కోసం 20 ఎకరాలు కేటాయించారని.. ఈ భూముల విలువ రూ.600 కోట్లుగా రావుల చెప్పారు. ఇంత ఖరీదైన భూముల్లో ఈ ముగ్గురు నివాసాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ముగ్గురు ఇళ్ల కోసం పెడుతున్న రూ.700 కోట్లతో తెలంగాణలోని 15 వేల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చని.. లేదంటే రూ.30 వేల ఎకరాల భూమిని కొని పేదలకు పంచి ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు. పేదల కోసం.. వారి బతుకుల్ని బాగు చేసేందుకే తాము ఉన్నట్లు చెప్పే అధినేతలు.. ఇలాంటి విషయాన్ని పరిగణలోకి ఎందుకు తీసుకోరన్నది ఒకప్రశ్నగా చెప్పొచ్చు.