Begin typing your search above and press return to search.

మనోళ్లే ఇలా కొట్టుకున్నారేంటి?

By:  Tupaki Desk   |   20 Dec 2018 8:08 AM GMT
మనోళ్లే ఇలా కొట్టుకున్నారేంటి?
X
క్రికెట్ మ్యాచ్‌ల్లో ఒక జట్టు ఆటగాడు ఇంకో జట్టు ఆటగాడితో వాగ్వాదానికి దిగడం.. గొడవ పడటం.. ఒకరినొకరు కవ్వించుకోవడం మామూలే. కానీ ఒకే జట్టు సహచరులు గొడవ పడితే చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిణామాలు కూడా అప్పుడప్పడూ జరుగుతుంటాయి. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఈ చిత్రం చోటు చేసుకుంది. పెర్త్ లో ముగిసిన రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆస్ట్రేలియా సారథి టిమ్ పైన్ మధ్య చిన్న స్థాయి వాగ్వాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ఐతే ఇదేమీ పెద్ద విషయం కాదు. మన జట్టుకే చెందిన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గొడవ పడటమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు వీరి మధ్య గొడవకు కారణమేంటన్నది వెల్లడి కాలేదు. కానీ ఇద్దరూ పరస్పరం బూతులు తిట్టుకున్నారు. ఒకరి వైపు ఇంకొకరు వేలు చూపిస్తూ వార్నింగులు కూడా ఇచ్చుకున్నారు. నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాడు నేథన్ లైయన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇషాంత్ వేసిన బంతి అతడి హెల్మెట్‌కు తాకింది. దీంతో అతడికేమైందా అని అంపైర్లు.. భారత జట్టు ఆటగాళ్లు అతడిని చూసేందుకు వెళ్లారు. అందరూ బ్యాటింగ్ క్రీజు వైపు లైయన్ చుట్టూ మూగి ఉంటే.. నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఇషాంత్-జడేజా గొడవ పడ్డారు. వారి మాటలు స్టంప్ మైక్రోఫోన్లో రికార్డయ్యాయి.

ఇద్దరూ హిందీలో బూతులు తిట్టుకున్నారు. నువ్వు నా వైపు చేయి చూపిస్తూ ఆదేశాలివ్వకు అని ఇషాంత్ అంటే.. నీ కోపాన్ని నామీద చూపించకని ఇషాంత్ అన్నాడు. ఇద్దరూ ఒకరి మీదికి ఒకరు దూసుకెళ్తుంటే.. ఫాస్ట్ బౌలర్‌ షమి వచ్చి విడదీశాడు. ఈ మ్యాచ్‌ కు జడేజా తుది జట్టులో లేడు. సబ్ స్టిట్యూట్ గా వచ్చాడు. మరి వీరి మధ్య గొడవ ఎలా మొదలైందో ఏమో కానీ.. ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఇలా గొడవ పడటం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.