Begin typing your search above and press return to search.

ధోనిని ఏమైనా అంటే.. ఆ 'సర్' ఊరుకోడు

By:  Tupaki Desk   |   10 Jan 2022 12:30 PM GMT
ధోనిని ఏమైనా అంటే.. ఆ సర్ ఊరుకోడు
X
టీమిండియాలో మహేంద్రసింగ్ ధోని-సురేశ్ రైనా, మహేంద్ర సింగ్ ధోని-రవీంద్ర జడేజా.. ఈ జంటలది గురుశిష్యుల బంధం. రైనా అటుఇటుగా ధోనితోనే కెరీర్ ప్రారంభించాడు. అయినా, తమ్ముడి తరహాలో ఉండేవాడు. అద్భుత బ్యాట్స్ మన్ అయిన అతడు అదే తీరు ఫీల్డర్ కూడా. ఓ దశలో కెరీర్ వెనుకబడిపోగా ధోని అండగా నిలిచి నిలబెట్టాడు. అయితే, గాయాలు రైనా కెరీర్ ను కుంగదీశాయి. ఉజ్వల భవిష్యత్ ఉన్న అతడు అనూహ్యంగా ధోనితో పాటే 2020 ఆగస్టులో రిటైరై ఆశ్చర్యపరిచాడు.

ఇక తనతో అత్యంత వ్యక్తిగత సాన్నిహిత్యం గల మరో క్రికెటర్ జడేజా కెరీర్ ను ధోని మలుపు తిప్పాడు. 2013కు ముందు సాధారణ స్పిన్నర్ గా కనిపించిన జడేజాకు తన మెరుపు కీపింగ్ తో అండగా నిలిచాడు ధోని. మెరుపు ఫీల్డర్ అయిన జడేజా దీన్ని అందిపుచ్చుకుని ఎదిగాడు. అసలు జడ్డూకు‘‘ సర్’’ బిరుదు ఇచ్చింది ధోనినే. అందుకే ధోని అంటే ఈ ఇద్దరికీ గురుభావం. సమయం వచ్చినప్పుడల్లా దానిని చాటుతూ ఉంటారు. తాజాగా జడేజా దీనిని మళ్లీ నిరూపించాడు.

అదెలాగంటే...

టీమ్‌ఇండియా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గాలి తీసేశాడు. ఆదివారం కేకేఆర్‌ టీమ్‌ ధోనీని ఉద్దేశించి ఓ పోస్టు చేయగా..దానికి కౌంటర్‌ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు ఆదివారం డ్రా గా ముగిసింది. ఇంగ్లాండ్‌ ఆఖరి వికెట్‌ కాపాడుకొని గట్టెక్కింది. అదే సమయంలో ఆసీస్‌ సైతం ఇంగ్లాండ్‌ టెయిలెండర్లను ఔట్‌ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు.

ఫీల్డర్లు అందరినీ బ్యాట్స్‌మెన్‌ చుట్టూనే ఏర్పాటు చేశాడు. దీంతో ఎలాగైనా ఆ ఒక్క వికెట్‌ సాధించి నాలుగో టెస్టును కైవసం చేసుకోవాలని చూశాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమై ఇంగ్లాండ్‌ ఊపిరిపీల్చుకుంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో ఒకసారి గౌతమ్‌ గంభీర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీకి అచ్చం ఇలాంటి ఫీల్డింగే ఏర్పాటు చేశాడు. ధోనీ డిఫెన్స్‌ను కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు. తాజా మ్యాచ్‌లోని ఈ సన్నివేశం..

కేకేఆర్‌ జట్టుకు ఒకప్పటి గంభీర్‌ చర్యను గుర్తుకు చేసింది. దీంతో నాటి ధోనీ ఫొటోతో సహా తాజా మ్యాచ్‌లోని ఆండర్సన్‌కు ఏర్పాటు చేసిన ఫీల్డింగ్‌ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది. ‘టెస్టుల్లో క్లాసిక్ సన్నివేశం.. మీకు టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది’ అని పోస్టు చేసింది. ఇది చూసిన జడేజా తనదైనశైలిలో స్పందించాడు.

అది మాస్టర్‌ స్ట్రోక్‌ కాదు. కేవలం షో ఆఫ్‌ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. మరోవైపు పలువురు ధోనీ అభిమానులు కూడా కేకేఆర్‌ టీమ్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు పోస్టులు మీమ్స్‌ షేర్ చేస్తూ కేకేఆర్‌ను ఆటపట్టిస్తున్నారు. కాగా, ఈ రెండు జట్లూ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో చివరిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగులతో గెలుపొంది నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై టీమ్‌ ఐపీఎల్‌ 2022కు జడేజాను అట్టిపెట్టుకుంది. కెప్టెన్‌ ధోనీ, రుతురాజ్‌, మొయిన్‌ అలీలను కూడా ఆ జట్టు తమ వద్దే పెట్టుకోవడం గమనార్హం.