Begin typing your search above and press return to search.

ఇవాంక బ్యాచ్ లో తెలంగాణ 'పులి'!

By:  Tupaki Desk   |   27 Nov 2017 5:43 AM GMT
ఇవాంక బ్యాచ్ లో తెలంగాణ పులి!
X
పులి ఏంటి? ఇవాంక‌తో పాటు రావ‌టం ఏమిటి? అన్న సందేహం అక్క‌ర్లేదు. నిజంగానే పులి కాదు.. పులి ఇంటి పేరున్న ఒక వ్య‌క్తి ఇవాంక‌తో పాటు జీఈఎస్ స‌ద‌స్సుకు రానున్నారు. అమెరికా అధ్య‌క్షుడి కుమార్తెతో పాటు వ‌చ్చే బృందంలో తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తికి ఎంట్రీ ఎలా? అన్న డౌట్ రావొచ్చు. దీనికి స‌మాధానం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌ట‌మే కాదు.. గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే అసాధ్య‌మేదీ కాద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి ర‌వి పులి. ఇత‌ను అల్లాట‌ప్ప వ్య‌క్తి కాదు. అమెరికాలోని ప‌లు సంస్థ‌ల్ని నెల‌కొల్పిన ఇత‌ను పుట్టింది ఎక్క‌డో తెలుసా? క‌నీస మౌలిక స‌దుపాయాలు లేని ఇప్ప‌టి జ‌య‌శంక‌ర్ జిల్లా (ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా)కు చెందిన తాడ్వాయి మండ‌లంలోని మారుమూల ప‌ల్లె అయిన కాటాపూర్‌.

స‌ర్కారీ స్కూల్లో చ‌దువుకున్న ఇత‌ను ప‌ట్టుద‌ల‌తో చ‌దువుకొని అమెరికాకు వెళ్లాడు. 1997లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా అమెరికాలో మొద‌లైన ఆయ‌న ప్ర‌యాణం కాల‌క్ర‌మంలో ఇంట‌ర్నేష‌న‌ల్ సొల్యూష‌న్స్ గ్రూపు వ్య‌వ‌స్థాప‌క సీఈవోగా.. ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. త‌ర్వాతి కాలంలో సొంతంగా కంపెనీలు పెట్టారు. అలా సాధార‌ణ స్థాయి నుంచి ప‌ట్టుద‌ల‌తో క‌ష్ట‌ప‌డి అసాధార‌ణ స్థాయికి చేరుకున్నారు.

హైద‌రాబాద్ లో జ‌రిగే జీఈఎస్ స‌ద‌స్సులో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక‌తో పాటు వ‌చ్చే పారిశ్రామిక‌వేత్త‌ల జాబితాలో ర‌వి పులి కూడా ఉన్నారు. ఈ స‌ద‌స్సులో వెంచ‌ర్ క్యాప్ట‌లిస్ట్ గా రానున్న ర‌వి పులిని చూసిన‌ప్పుడు తెలుగోడు ఎవ‌రైనా గ‌ర్వ‌ప‌డాల్సిందే.

ఒక‌ప్పుడు క‌నీస సౌక‌ర్యాలు కూడా లేని ఊళ్లో పుట్టి.. అంచ‌లంచెలుగా ఎద‌గ‌ట‌మే కాదు.. ఈ రోజున ఇవాంక హాజ‌ర‌య్యే భేటీకి మొన‌గాళ్లు లాంటోళ్ల‌కు ఎంట్రీ కూడా ద‌క్క‌ని స‌ద‌స్సుకు.. ఆమెతో పాటుగా అమెరికా నుంచి రావ‌టం చూస్తే.. మ‌నోడు ఎంత‌గా ఎదిగాడో ఇట్టే అర్థ‌మవుతుంది. ఇవాంక బ్యాచ్ లో మ‌నోడు.. అదే మ‌న పులి ఉండ‌టానికి మించిన సంతోషం ఏం ఉంటుంది. ఇవాంక‌తో పాటు వ‌స్తున్న బృందంలో మాతృభూమికి రావ‌టం చాలా సంతోషంగా ఉంటుంద‌ని చెబుతున్నారు ర‌వి పులి. ఇంత సాధించిన ఆయ‌న‌కు ఆనంద‌మేమో కానీ.. ఆయ‌న్ను చూసుకొని ప్ర‌తి తెలుగోడు మురిసిపోవ‌టం ఖాయం.