Begin typing your search above and press return to search.

అమ్మాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నారా..అయితే ఇది మీకోసమే!

By:  Tupaki Desk   |   21 April 2020 2:40 PM IST
అమ్మాయిలకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతున్నారా..అయితే ఇది మీకోసమే!
X
సోషల్ మీడియా ..ఇప్పుడు పదేళ్ల పిల్లల నుండి రేపో - మాపో పోయే పండు ముసలివాళ్ల వరకు అందరూ ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అందులోనే గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా లో అమ్మాయిలకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా పేస్ బుక్ లో అమ్మాయి ఫోటో కనిపిస్తే చాలు ..లైక్స్ - కామెంట్స్ విపరీతంగా వస్తాయి. అమ్మాయి ఫోటో కనిపించగానే.. ఆ ఫోటో ఎలా ఉన్నా కూడా అమ్మాయి అయితే చాలు .. క్షణం కూడా ఆలోచించకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంటారు.

ఇక ఆ ఫోటో హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసేసి కానిది అయితే , క్షణాల వ్యవధిలో లక్షల లైక్స్ వస్తాయి. ఈ విషయాన్ని బాగా పసిగట్టిన ఓ వ్య‌క్తి అమ్మాయి అవ‌తారం ఎత్తి ఓ ఆట ఆడుకున్నాడు. చివ‌రికి క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. అసలు ఈ వ్యవహారం పై పూర్తి వివరాలు చూస్తే ... పేరు ‘నిషా జిందాల్’... ఫేస్‌‌ బుక్‌ లో 10 వేల మంది ఫాలోవర్లు.. హీరోయిన్లకు తీసిపోని ప్రొఫైల్ ఫోటో... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో ఆమెను అరెస్టు చేయడానికి వెళ్లిన ఛత్తీస్‌ గఢ్ పోలీసులు ఆ స్థానంలో అతడిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి నిషా అంటే అమ్మాయి కదా ..అబ్బాయి ఉన్నాడేంటి అని ఆలోచనలో పడ్డారు. అయితే , ఆ తరువాత వెంటనే విషయాన్ని పసిగట్టి ..అతడి నుండి అన్ని విషయాలని రాబట్టారు.

ఛ‌త్తీస్‌ గ‌డ్‌ లోని రాయ్‌ పూర్‌ లో 31 ఏళ్ల ర‌వి పూజార్‌ ‘నిషా జిందాల్’ పేరుతో ఫేస్‌ బుక్‌ లో 8 ఏళ్ల క్రితం ఖాతా తెరిచాడు. ఫేస్‌ బుక్ ప్రొఫైల్ అమ్మాయిది కావ‌డం, అందులోనూ అంద‌మైన‌ది కావ‌డంతో విపరీతంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చాయి అలా ఈ 8 ఏళ్ల‌లో ప‌ది వేల మంది నిషా ఖాతాకు ఫాలోవ‌ర్లు త‌యార‌య్యారు. అయితే ఈ ఫేస్‌ బుక్‌ లో రెచ్చ‌గొట్టే కామెంట్స్‌ పై కొంద‌రు ఛ‌త్తీస్‌ గ‌డ్‌ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఎట్ట‌కేల‌కు ఫేస్‌ బుక్ ప్రొఫైల్ నిషా జిందాల్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. తీరా అక్క‌డికి చేరుకున్న పోలీసుల‌కు ఆ ఖాతా ఆమెది కాదు...అత‌నిది అని తెలియ‌డంతో షాక్ అయ్యారు.

అతడు .. 11 ఏళ్లుగా ఇంజినీరింగ్ డిగ్రీ పరీక్షలతో కుస్తీ పడుతున్నట్టు తేల్చారు. ఒక్క ‘నిషా జిందాల్’ మాత్రమే కాదు.. 2012 నుంచి పాకిస్తాన్ నటి మిరాషా పాషా లాంటి పేర్లతో రవి అనేక నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. ఎవరికీ, ఏమాత్రం అనుమానం రాకుండా అతడు జాగ్రత్తలు తీసుకోవడంతో పది వేల మంది ఫాలోవర్లు ఇంత కాలం అతడిని గుడ్డిగా ఫాలోఅవుతున్నట్టు కనిపిస్తోంది. త‌నను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి ర‌వి భ‌య‌ప‌డ్డాడు. అతని ల్యాప్‌ టాప్ - మొబైల్ పోన్‌ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సైబ‌ర్ నేరం కింద‌ అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

అలాగే రవి ఫోటో తీసి - అతడి ఫేక్ ఖాతాల్లో అసలు రూపం బయటపెట్టారు. ‘నేనే నిషా జిందాల్.. నేను పోలీస్ కష్టడీలో ఉన్నాను’ అని సైబ‌ర్ పోలీసులు అత‌నితో పోస్టు చేయించారు. దీనిపై సీఎం భూపేశ్ బాఘెల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ పోలీసులను అభినందించారు. ‘‘మోసగాళ్లను వదిలే ప్రసక్తే లేదు. సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్న ఇలాంటి శక్తులన్నిటీనీ రట్టు చేయాలి.. రాయ్‌‌ పూర్ పోలీసులకు అభినందనలు..’’ అని సీఎం ట్వీట్ చేశారు.