Begin typing your search above and press return to search.

గన్ మెన్లకు చుక్కలు చూపించిన రావెల

By:  Tupaki Desk   |   26 Jan 2017 10:32 AM IST
గన్ మెన్లకు చుక్కలు చూపించిన రావెల
X
నోరు పారేసుకోవటం.. ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవటం.. లాంటి వైఖరితో ఇప్పటికే ఏపీముఖ్యమంత్రి చంద్రబాబుకు చికాకుగా మారినట్లు చెబుతున్న మంత్రి రావెలకు సంబంధించిన మరో వ్యవహారం సంచలనంగా మరింది. గన్ మెన్లకు సమాచారం ఇవ్వకుండా ఆయన మూడున్నర గంటల పాటు మిస్ కావటం ఆందోళనతో పాటు హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మిస్ అయిన వైనంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి.. వాకబు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళుతున్నట్లు రావెల చెబుతున్నప్పటికీ.. ఆయన మిస్సింగ్ భద్రతా విభాగానికి ముచ్చెమటలు పోసేలా చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తన రోజువారీ కార్యక్రమాల్ని ముగించుకొని గుంటూరులోని తన ఇంటికి వచ్చారు మంత్రి రావెల. ఆ సమయంలో ఇంటి బయట భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు. సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక కారు మంత్రి రావెల ఇంటికి వచ్చింది. ఏడు గంటల ప్రాంతంలో మంత్రి ఆ కారులో బయటకు వెళ్లారు. ఈ విషయం గన్ మెన్లకు కాస్త ఆలస్యంగా తెలిసిందే.

ఏదో పనికి వెళ్లి ఉంటారని భావించిన వారు.. అరగంటకూ మంత్రి రాకపోవటంతో టెన్షన్ ఫీలయ్యారు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ.. మంత్రికి సంబంధించిన సమాచారం లేకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైన వారు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో.. ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఇదిలా ఉంటే.. రాత్రి పదిన్నర గంటల సమయంలో మంత్రి రావెల తాపీగా ఇంటికి వచ్చారు. అప్పటికి కానీ అధికారుల టెన్షన్ తీరలేదు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీరు సరికాదంటూ ఆయన మంత్రిని మందలించినట్లుగా తెలుస్తోంది. మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్లినట్లుగా రావెల వివరణ ఇచ్చినప్పటికి.. గన్ మెన్లకు సమాచారం అందించకుండా భోజనానికి వెళ్లాల్సి వచ్చిన సదరు ఫ్రెండ్ ఎవరన్నది ఇప్పడు ఆసక్తికర చర్చగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/