Begin typing your search above and press return to search.

శభాష్ రావెల; ఆ చిన్నారిని హత్తుకున్నారు

By:  Tupaki Desk   |   9 Sep 2015 5:54 AM GMT
శభాష్ రావెల; ఆ చిన్నారిని హత్తుకున్నారు
X
రాజకీయ నాయకుల్లో చాలా కోణాలుంటాయి. దురదృష్టవశాత్తు విమర్శలు.. ఆరోపణలు లాంటి నెగిటివ్ అంశాలు మాత్రమే ఫోకస్ అవుతుంటాయి. నలుగురికి స్ఫూర్తిని కలిగించే అంశాలు పెద్దగా బయటకు రావు. నిజానికి.. వారు చేసే కొన్ని పనులు చూసినప్పుడు వారి విశాల హృదయానికి.. మంచి మనసుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి.

దురదృష్టవశాత్తు అలాంటి అంశాలు మీడియాలో పెద్దగా ఫోకస్ కావు. చెడు గురించి పెద్దగా మాట్లాడే మీడియా... వారిలోని మంచిని గురించి అంత స్థాయిలో కాకున్నా ఎంతోకొంత స్థాయిలో అయినా మాట్లాడాలిగా.

తాజాగా ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు చేసిన పని పలువురి ప్రశంసలు అందుకుంటుంది. ఎయిడ్స్ తో బాధ పడుతున్న పదేళ్ల బాబును భావోద్వేగంగా దగ్గరకు తీసుకోవటమే కాదు.. అప్యాయంగా హత్తుకున్నారు. హెచ్ ఐవీ పాజిటివ్.. ఎయిడ్స్ బారిన పడిన వారిని దగ్గరకు తీయటానికి ఏ మాత్రం ఇష్టపడని రోజుల్లో.. ఎలాంటి ఆలోచన లేకుండా.. అప్యాయంగా దగ్గరకు తీసుకోవటం ఎందరినో కదిలించేసింది.

ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎయిడ్స్ బాధిత చిన్నారులతో గుంటూరులో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మంత్రి రావెల ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక బాబు మంత్రితో మాట్లాడుతూ.. తనకు ఎయిడ్స్ ఉందని చెప్పారని.. తానిప్పుడు తన పిన్ని దగ్గర ఉంటున్నానని.. ఆమె తనను చాలా చక్కగా చూసుకుంటుందని.. తనకు ఏదైనా సాయం చేస్తారా? అన్న మాటలు విన్న వెంటనే రావెల కదిలిపోయారు.

నెల్లూరుకు చెందిన ఈ బాబును ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. తనతో వచ్చేస్తావా? నేను పెంచుకుంటానని అడిగారు. దానిక సమాధానం ఇచ్చిన ఆ చిన్నారి తన పిన్ని తనను చాలా బాగా చూసుకుంటుదని బదులిచ్చాడు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు తమ గురించి చెబుతున్నప్పుడు వేదిక దిగి వచ్చిన మంత్రి రావెల.. కంట కన్నీరు పెట్టుకొని వారిని దగ్గరకు తీసుకున్నారు. రావెల భావోద్వేగ స్పందన అక్కడి వారి మనసుల్ని హత్తుకునేలా చేసింది.