Begin typing your search above and press return to search.

చిన్న ఎలుక.. 200 మందిని హ‌డ‌లెత్తించింది!

By:  Tupaki Desk   |   29 Aug 2017 4:19 AM GMT
చిన్న ఎలుక.. 200 మందిని హ‌డ‌లెత్తించింది!
X
సాధార‌ణంగా ఎల‌క‌లు మ‌న‌ల్ని చూసి చాలా భ‌య‌ప‌డ‌తాయి. ఒక్కోసారి దానిని చూసి మ‌నం కూడా కంగారుప‌డ‌తా మ‌నుకోండి! కానీ అలాంటి సంద‌ర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇలా ఒక ఎలుక 200 మందిని తెగ కంగారు పెట్టింది. కాదు.. కాదు ముప్పు తిప్ప‌లు పెట్టింది. మూడు చెరువుల నీళ్లు తాగేలా చేసింది! ఒక‌టి కాదు రెండు ఏకంగా ఆరు గంటల పాటు దానిని ప‌ట్టుకునేందుకు వ‌చ్చిన వారికి దొర‌క‌కుండా చుక్క‌లు చూపించింది. చివ‌ర‌కు ఎలాగొలా క‌ష్ట‌ప‌డి దానిని ప‌ట్టుకోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విచిత్రక‌ర సంఘ‌ట‌న ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్ర‌యంలో జ‌రిగింది.

ప్రపంచంలోనే అత్యధిక దూరం ప్రయాణించే ఢిల్లీ-శాన్‌ ఫ్రాన్సిస్కో ఎయిర్‌ ఇండియా-173 విమానం టేకాఫ్‌ కు సిద్ధంగా ఉంది. సుమారు 200 మంది ఇందులో ప్ర‌యాణానికి సిద్ధంగా ఉన్నారు. మ‌రికొద్ది క్ష‌ణాల్లో విమానం గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉంద‌న‌గా.. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో మ‌రి చిన్న ఎలుక విమాన సిబ్బంది కంట ప‌డింది. ఇక అంతే సంగ‌తులు! దానిని ప‌ట్టుకునే వ‌ర‌కూ విమానం బ‌య‌ల్దేరేది లేద‌ని ప్ర‌యాణికుల‌కు చెప్పారు. దీంతో 200 మందిని విమానం నుంచి దించేశారు. ఇక చిట్టెలుక కోసం విమానాన్ని జ‌ల్లెడ ప‌ట్టారు. సింపుల్‌ గా దొరికితే దాని గొప్ప‌త‌న‌మేముంది చెప్పండి!

దాదాపు ఆరు గంట‌ల పాటు అంగుళం అంగుళం వెతికి వెతికి శ్రమిస్తే గాని ప‌ట్టుబ‌డ‌లేదు ఆ చిట్టెలుక గారు!! తీరా ఇంతలో విమాన సిబ్బంది షెడ్యూల్ టైమ్ పూర్తయిపోయింది. నిబంధనల ప్రకారం వారి తర్వాతి డ్యూటీ సిబ్బంది వచ్చే వరకు విమానం ప్రయాణికులతో స‌హా ఎదురు చూసింది. ఇది మరో మూడు గంటలసేపు కొనసాగింది. దీంతో మొత్తం 9 గంటలసేపు 200 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 9 గంటల విరామం ముగిసిన తరువాత విమానం శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరింది. మ‌రి చిన్న ఎలుక ఎంత ప‌నిచేసిందో క‌దా!!