Begin typing your search above and press return to search.

అఫ్గాన్ క్రికెట్ బోర్డు పై రషీద్ ఆగ్రహం.. మిస్టరీ స్పిన్నర్ ఊహించని నిర్ణయం

By:  Tupaki Desk   |   10 Sep 2021 6:33 AM GMT
అఫ్గాన్ క్రికెట్ బోర్డు పై రషీద్ ఆగ్రహం.. మిస్టరీ స్పిన్నర్ ఊహించని నిర్ణయం
X
యూఏఈ, ఓమన్ వేదికలుగా మరో నాలుగు వారాల్లో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. సెప్టెంబర్ 10లోగా 15 మంది ప్రధాన ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బంది వివరాలను ఐసీసీ పంపాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డ్ 18 మందితో కూడిన జట్టను ప్రకటించింది. వీరితో పాటు ఇద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా కూడా చేర్చింది. ఇదే విషయాన్ని ఏసీబీ మీడియా తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. రషీద్ ఖాన్ కెప్టెన్‌ గా ఏసీబీ మీడియా ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ చేసిన 22 నిమిషాల్లోనే రషీద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తనను సంప్రదించకుండానే ఆటగాళ్లను ఎంపిక చేసిందని, సెలెక్షన్ కమిటీ, ఏసీబీ నా అనుమతి లేకుండానే జట్టును ప్రకటించిందని, అందుకే తాను కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్‌ లో పేర్కొన్నాడు. తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ఆ ట్వీట్‌ లో పేర్కొన్నాడు.

ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉంది. అయితే ప్రపంచ కప్ సమయం దగ్గరకు వస్తుండటంతో అన్ని దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ విషయంలోనే ఆ జట్టు టీ20 కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ అసహనానికి లోనయ్యాడు. ఈ మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్ అయిన తనను బోర్డు సభ్యులు సంప్రదించలేదని. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుండు తప్పుకుంటున్నాను తెలిపాడు.

కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆడటం తనకు ఎప్పుడు గర్వకాణమే అని ప్రకటించాడు. ఇక రషీద్ తప్పుకోవడంతో ఆ జట్టుకు ఆల్ రౌండర్ నబీ ని కెప్టెన్ గా నియమించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జులైలో ఏసీబీ చీఫ్ సెలెక్టర్ అసదుల్లా ఖాన్ రాజీనామా చేశారు. బోర్డులో చాలా అవకతవకలు జరుగుతున్నాయని.. క్రికెటేతరుల జోక్యం చాలా ఎక్కువైందని.. కనీసం క్రికెట్ అంటే కూడా అవగాహన లేని వ్యక్తులు, ఎంపిక ఎలా చేస్తారో తెలియని వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారని పేర్కొంటూ ఆయన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచే అఫ్గాన్ జట్టు ఎంపిక సరిగా జరగడం లేదని రషీద్ ఖాన్ కూడా అంటున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో చాలా మంది గతంలో జాతీయ జట్టుకు ఆడిన క్రికెటర్లే. కానీ వీళ్లెవరూ ప్రస్తుతం జట్టులో రెగ్యులర్‌ గా కొనసాగడం లేదు.

ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్‌కు వెళ్లే జట్టులో ఫామ్‌ లో ఉన్న, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిని ఎంపిక చేయకుండా, గత రెండు మూడేళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న వారిని చేర్చడంపై రషీద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం 15 మంది క్రికెటర్లతో పాటు, రిజర్వ్ ప్లేయర్లను కూడా ప్రకటించాల్సి ఉన్నది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ లో ఐసీసీ నిబంధనలు మార్చింది. కోవిడ్-19 దృష్టిలో పెట్టుకొని 23 నుంచి 30 మంది క్రికెటర్లు, సహాయక సిబ్బందిని ప్రకటించేందుకు అనుమతి ఇచ్చింది. కానీ ఏసీబీ కేవలం 18 మంది ఆటగాళ్లను మాత్రమే ప్రకటించింది. దీనిపై కూడా రషీద్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. దీనితో ఊహించని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.