Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రసమయి బూతులు.. సర్పంచి రాజీనామా , ఆడియో వైరల్

By:  Tupaki Desk   |   6 Sep 2021 6:31 AM GMT
ఎమ్మెల్యే  రసమయి బూతులు.. సర్పంచి రాజీనామా , ఆడియో వైరల్
X
తెలంగాణలో రాజకీయం రోజురోజుకి మరింతగా వేడెక్కుతుంది. ఓ వైపు హుజురాబాద్ ఉప‌ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉక్కు సంకల్పంతో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఓ వైపు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కారణంగా పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయ్యింది. మానకొండూర్‌ నియోజకవర్గంలో తన భూమి విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్న తీరుతో మనస్తాపం చెందిన ఓ సర్పంచి ఆ ఎమ్మెల్యే పై సంచలన ఆరోపణలు చేసి , టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.

ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు వైరల్‌ గా మారింది. శంకరపట్నం మండలం కరీంపేట సర్పంచి మల్లయ్య వివరాల మేరకు.. ‘గ్రామంలో 1.18 గుంటల నా భూమిని కొందరు ఆక్రమించుకుని ఇళ్లు కడుతున్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ గ్రామానికి చెందిన కొందరికి తన భూమిని ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే బాలకిషన్ తనను కించపరిచేలా మాట్లాడారంటూ మల్లయ్య ఆడియో రికార్డును విడుదల చేశారు. ఎమ్మెల్యే తీరుతో మనస్తాపం చెంది తాను టీఆర్ ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో నిజానిజాలు వెల్లడికావాల్సి ఉంది.

మరోవైపు ఈ ఆడియో సంభాషణకు ముందు కరీంపేటకు వెళ్లిన కేశవపట్నం ఎస్సై ప్రవీణ్‌రాజు తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెం మాజీ సర్పంచి ఎల్కపల్లి సంపత్‌ పై చేయిచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ కు తరలించారు. దీనిపై ఎస్ ఐ ని మీడియా వివరణ కోరగా,శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సంపత్‌ను స్టేషన్‌ కు తీసుకెళ్లామని సీఐ కిరణ్‌ తెలిపారట. మొత్తానికి ఎమ్మెల్యే, సర్పంచ్ వ్యవహారం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మధ్యనే భూఅక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుండి తొలగించడం..ఆ తర్వాత ఈటెల పార్టీ కి రాజీనామా చేయడం తో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం.తర్వాత బిజెపి లో చేరడం, హుజురాబాద్ నియోజకవర్గం నుండి పోటీలో దిగడం చకచకా జరిగిపోయింది.