Begin typing your search above and press return to search.

కిడ్నీలో 156 రాళ్లు.. హైదరాబాద్ లో అరుదైన సర్జరీ

By:  Tupaki Desk   |   17 Dec 2021 9:15 AM IST
కిడ్నీలో 156 రాళ్లు.. హైదరాబాద్ లో అరుదైన సర్జరీ
X
రాళ్ల కుప్పలా మారింది ఒక వ్యక్తి కిడ్నీ. అరుదైన కేసుగా అభివర్ణిస్తున్న ఈ ఉదంతంలో హైదరాబాద్ వైద్యులు ప్రదర్శించిన నైపుణ్యం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఒక వ్యక్తి కిడ్నీలో ఏకంగా 156 రాళ్లు ఉండటం ఒక ఎత్తు అయితే.. వీటి బరువు 350గ్రాములు ఉండటం గమనార్హం. అంత భారీగా రాళ్లు ఉన్న కిడ్నీలో నుంచి వాటిని వెలికి తీయటం ఒక సవాలు అయితే.. మిగిలిన రోగులకు భిన్నమైన పరిస్థితుల్లో సదరు రోగి ఉన్నారు.

కిడ్నీలో ఇంత భారీగా రాళ్లు పేరుకుపోవటాన్ని చూసిన వైద్యులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఇటీవల పొట్టలో నుంచి భరించలేనంత నొప్పి రావటంతో వైద్యులు స్కానింగ్ తీయటం.. అందులో మూత్రపిండంలోని కుడివైపున రాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన బసవ రాజ్ కు గతంలోనూ కిడ్నీలో రాళ్లు ఉంటే వాటిని తొలగించారు.
గతానికి భిన్నంగా ఈసారి ఆయన కిడ్నీలో పెద్ద ఎత్తున రాళ్లు డిపాజిట్ కావటం చూసిన వైద్యులు విస్మయానికి గురయ్యారు. మిగిలిన వారికి భిన్నంగా.. చాలా తక్కువ మందిలో క్లిష్టమైన పద్దతిలో కిడ్నీ అమరిక ఉంటుంది. ఇలాంటి వారికి మూత్రకోశం వద్ద కాకుండా పొట్ట సమీపంలో కిడ్నీ ఉంటుంది. దీన్ని ఎక్టోపిక్ కిడ్నీగా వ్యవహరిస్తారు. ఇలా కిడ్నీ ఉన్న వారికి రాళ్లు తొలగించటం కష్టమైన పని.

అందులోనూ 156 రాళ్లు ఉన్నప్పుడు.. వాటిని పొట్టపై కోత లేకుండా కీహోల్ పద్దతిలో సర్జరీ చేసి రాళ్లను తొలగించారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనదిగా చెబుతారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి..రాళ్లను బయటకు తీశారు. మొదట పెద్ద రాయి (3ఎంఎం కంటే కాస్త పెద్దదని చెబుతున్నారు)ని బయటకు తీశారు. అనంతరం చిన్న రాళ్లను బయటకు తీశారు. ఇలా తీసిన మొత్తం రాళ్లు 156 కావటం అరుదైన కేసుగా వైద్యులు చెబుతున్నారు. సర్జరీని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన క్రెడిట్ హైదరాబాద్ లోని ప్రీతి యూరాలజీ ఆసుపత్రి వైద్యులకు చెందుతుంది. తాజాగా రోగి పూర్తిగా కోలుకోవటంతో అతడ్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.