Begin typing your search above and press return to search.

కేజీ టీ పొడి రూ.50వేలు.. ప్రత్యేకత ఏముంటుంది?

By:  Tupaki Desk   |   31 July 2019 10:17 AM IST
కేజీ టీ పొడి రూ.50వేలు.. ప్రత్యేకత ఏముంటుంది?
X
కిలో టీ పొడి ఎంత ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే.. ఎంత ఖరీదైన టీ పొడి అయినా వెయ్యి రూపాయిలు దాటదన్న సమాధానం వస్తుంది. కానీ.. ఆ అంచనా ఎంత తప్పో చెప్పేసింది తాజాగా గువాహటి టీ వేలం వ్యవహారం. ప్రతి ఏడాది టీ పొడిని ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులు బహిరంగ వేలాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వేలానికి పెద్ద ఎత్తున వర్తకులు వచ్చి.. తాము సేకరించిన అత్యుత్తమ టీ పొడిని తీసుకొచ్చి అమ్మకానికి పెడుతుంటారు.

అలా వేలానికి వచ్చిన టీ పొడిలో గువాహటికి చెందిన ఒక సంస్థ తీసుకొచ్చిన సంప్రదాయ టీ పొడికి కేజీ రూ.50వేల చొప్పున అమ్మటం సంచలనంగా మారింది. ఈ ధరకు రెండు కేజీల టీని అమ్మారు. ఇంతకీ ఆ టీ వెరైటీ ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా పీ-126గా చెబుతున్నారు. మార్కెట్లో ఈ రకానికి గొప్ప గిరాకీ ఉందని చెబుతున్నారు.

అంతేకాదు.. తాజా వేలం పుణ్యమా అని ఇప్పటివరకూ కేజీ టీ రూ.40వేల రికార్డు తుడిచి పెట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. తాజాగా పలికిన ధర రికార్డు మాత్రమే కాదు.. ఇదే తొలిసారి అని ఆనందంగా చెబుతున్నారు. ఇక.. ఇంత ఖరీదైన టీని తయారు చేసిన యజమాని వివరాల్లోకి వెళితే అసోంకు చెందిన మనోహరి గోల్డ్ టీగా చెబుతున్నారు. పేరులోనే కాదు..ధరలోనూ అదే తీరులో ఉందన్న మాట వినిపించింది. ఇంతకీ.. ఇంత ఖరీదైన టీ ప్రత్యేకత ఏమిటి? మిగిలిన టీకి.. దీన్లో ఉండే తేడా ఏమిటి? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఈ టీ బంగారు వర్ణంలో ఉంటుందని.. రుచిలోనూ అమోఘంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఖరీదైన టీ గురించి ఎంత చెప్పినా వినాల్సిందే. ఎందుకంటే.. ఇలాంటి టీ గురించి వినటమే కానీ.. రుచి చూసే అవకాశం దక్కదు కదా?