Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు మ‌ద్ద‌తు తెలిపిన‌ కాంగ్రెస్ ఎంపీ

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:07 AM GMT
కేసీఆర్‌ కు మ‌ద్ద‌తు తెలిపిన‌ కాంగ్రెస్ ఎంపీ
X
తెలంగాణ రాష్ట్రంలోమల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సృష్టించిన ర‌చ్చ అంతా ఇంత కాదు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మొట్ట‌మొద‌టి అత్యంత ఘాటైన నిర‌స‌న రూపం మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ వ్య‌తిరేక‌త ద్వారానే క‌నిపించింది. ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ చేసిన ర‌చ్చ అంతా ఇంత కాదు కానీ ఇలాంటి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ఎంపీ మ‌ద్ద‌తిచ్చారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కొందరు నాయకులు కావాలనే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొంటూ ప‌రోక్షంగా త‌మ పార్టీ నేత‌ల‌కు చుర‌క అంటిస్తూ కేసీఆర్‌ కు మ‌ద్ద‌తిచ్చారు.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్మిస్తున్న ప్రాంత‌మైన సిద్దిపేట జిల్లా తొగుటలో రాపోలు ఆనంద‌భాస్క‌ర్ మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్‌ తో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిసినా గుడ్డి వ్య‌తిరేక‌త ఎందుక‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం అన్ని ప‌రిణామాలు లెక్క‌లోకి తీసుకొని ముందుకు సాగాల‌ని కోరారు. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, మల్లన్నసాగర్‌లో ముంపునకు గురవుతున్న ప్రజలకు పునరావాసం కల్పించాలని ఆనంద్ భాస్క‌ర్‌ కోరారు. త‌ద్వారా ఇటు ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌ని అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి ఇబ్బందులు ఎదురుకావ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తీరుపైనా ఆనంద్ భాస్క‌ర్‌ మండిప‌డ్డారు. ఒక పద్ధతి - ప్రణాళిక లేకుండా పెద్ద నోట్లను రద్దు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై అణ్వస్త్ర దాడి చేశారని విమర్శించారు. నోట్ల రద్దు ఒక అవివేక చర్య అని పేర్కొంటూ. నోట్ల రద్దు తర్వాత లోటును భర్తీ చేసే చర్యలు తీసుకోవడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. ఖాతాల్లో డబ్బు ఉండి కూడా వినియోగించుకోలేని దుస్థితిలో ప్రజలున్నారని - బ్యాంకులు - ఏటీఎంల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాకతప్పదని ఆనంద్ భాస్క‌ర్‌ హెచ్చరించారు. నోట్ల రద్దుతో వ్యవసాయం - చిరు వ్యాపారులు - మధ్య - సామాన్య తరగతి ప్రజలు - అసంఘటిత రంగాల ప్రజల ఉపాధి చిన్నాభిన్నమైందన్నారు. డిసెంబర్ చివరి నాటికి నగదు సమస్య ఉండదని చెప్పిన ప్రధాని మోదీ మాటలు ఆచరణలో ఎండమావిగా మారాయని ఆనంద్ భాస్క‌ర్ విమ‌ర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/