Begin typing your search above and press return to search.

దేశంలోనే తొలిసారిగా ర్యాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టం రైలు .. ప్రత్యేకతలివే!

By:  Tupaki Desk   |   26 Sep 2020 6:30 AM GMT
దేశంలోనే తొలిసారిగా ర్యాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టం రైలు .. ప్రత్యేకతలివే!
X
దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కొత్త రైలును తీసుకొచ్చింది. ఈ రైలుకు సంబంధించిన డిజైన్​ను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ శుక్రవారం విడుదల చేసింది. కేవలం బ్రిటన్​, జపాన్​ లాంటి దేశాల్లో మాత్రమే ఉన్న ఈ ర్యాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టమ్​ రైళ్లను తొలి సారిగా మన దేశంలోకి తీసుకొచ్చారు.

ఎక్కడి నుంచి ఎక్కడికి..
ఢిల్లీ - ఘజియాబాద్‌ - మీరట్‌ ప్రాంతాలను కలుపుతూ ప్రయోగాత్మకంగా ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) రైలు మార్గాన్ని నిర్మించడానికి ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.

దేశ రాజధాని ప్రాంతం (NCR) వెంట ఆర్‌ఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ఎన్‌సీఆర్‌టీసీ పేరుతో జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. ఆర్‌ఆర్‌టీఎస్‌ రైలు మార్గం నిర్మాణాన్ని ఈ కంపెనీ పర్యవేక్షిస్తుంది. ఈ తరహా రైళ్లు మామూలు రైళ్లకంటే రెట్టింపు వేగంతోప్రయాణించనున్నాయి. దీంతో ప్రయాణ సమయం తగ్గనుంది. పైలట్​ ప్రాజెక్ట్​ కింద 82 కిలోమీటర్ల మేర ఈ రైలు ట్రాక్‌ ను నిర్మించనున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ, మీరట్ నగరాల మధ్య ప్రయాణానికి 3, 4 గంటల సమయం పడుతోంది. ఈ కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే కేవలం గంట సమయమే పట్టనుంది. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో నిర్మిస్తారు. వీటి బరువు చాలా తేలిక. అంతేకాక ఈ రైళ్లలో ఏసీ, ప్రయాణికులకు వైఫై కూడా అందుబాటులో ఉంటుంది. 2023 నాటికి తొలిదశ ట్రాక్​ నిర్మించాలని యోచిస్తున్నారు. 2025 నాటికి ఈ రైలుమార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.