ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపినోడ్ని తప్పించిన స్నేహితుడు

Tue Sep 14 2021 09:29:50 GMT+0530 (IST)

rape on six-year-old girl

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరి గురించి తెలిస్తే.. రక్తం సలసలా మరుగుతుంది. ఇలాంటి రాక్షసుల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదన్న భావన కలగటం ఖాయం. ఇందులో ఒకరు దారుణమైన నేరానికి పాల్పింది ఒకరైతే.. మరొకరు నరరూప రాక్షసుడ్ని తప్పించేందుకు సాయం చేసినోడు ఇంకొకడు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారటమే కాదు.. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది సైదాబాద్ హత్యాచార కేసు. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపించి దారుణంగా అత్యాచారం చేసి.. చంపేసిన ఛండాలుడు ఈ ఫోటోలోని ఇద్దరిలో ఒకరు.టోపీ.. మాస్కు ధరించి ఉన్నాడే.. వాడే హత్యాచార నిందితుడు. ఇతగాడి మీద అనుమానాన్ని చిన్నారి తల్లిదండ్రులు వ్యక్తం చేసినా.. పోలీసులు సరిగా స్పందించలేదన్న మాట వినిపిస్తోంది. చిన్నారిని దారుణంగా హత్యాచారం చేసిన నిందితుడు రాజుగా గుర్తించారు. అయితే.. అతడ్ని తప్పించేందుకు అతడి స్నేహితుడు సాయం చేసిన వైనం.. తాజాగా గుర్తించిన సీసీ ఫుటేజ్ తో బయటకు వచ్చింది.

చిన్నారి కోసం పోలీసులు.. ఆమె తల్లిదండ్రులు.. స్థానికులు గాలిస్తున్న వేళ.. రాజు స్నేహితుడు (ఫోటోలో మాస్కు లేని వ్యక్తి) అతడికి టోపీ పెట్టి.. ముఖానికి మాస్కు.. తువ్వాలు.. ఒక జత బట్టలతో కూడిన సంచిని ఇచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు తగ్గట్లే.. తాజాగా పోలీసులు సీసీ ఫుటేజ్ లో.. ఈ ఇద్దరిని గుర్తించారు. నిందితుడు రాజు గంజాయి పీల్చటంతో పాటు.. గుడుంబా ఎక్కువగా తాగుతుంటాడని.. అతడి దగ్గర సెల్ ఫోన్ లేకపోవటంతో అతడి ఆచూకీ కనుక్కోవటం కష్టంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు. నిందితుడ్ని తప్పించేందుకు సాయం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి సాయంతో ఈ రాక్షసుడ్ని పట్టుకుంటామన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు.. నిందితుడ్ని కూడా పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నా.. అధికారులు మాత్రం కన్ఫర్మ్ చేయటం లేదు.