Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యేతో సహా ఏడుగురిపై అత్యాచార కేసు..బాధితురాలికి భద్రత పెంపు !

By:  Tupaki Desk   |   21 Feb 2020 1:15 PM IST
బీజేపీ ఎమ్మెల్యేతో సహా ఏడుగురిపై అత్యాచార కేసు..బాధితురాలికి భద్రత పెంపు !
X
దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికి ఆడవారిపై జరిగే అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు. ఈ క్రమంలోనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద ఇప్పటికే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే సెంగార్ ఇప్పటికే దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా మరో బీజేపీ నేత అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠి, ఆయన అనుచరులు ఆరుగురిపై అత్యాచారం కేసు నమోదైంది. వారు తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ 40 ఏళ్ల మహిళ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017లో తనను బంధించి నెల రోజులపాటు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. తాను గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపించింది.

2016లో తనపై మొదటిసారి త్రిపాఠి బంధువు సందీప్ తివారి అత్యాచారం చేసినట్టు గా ఆమె ఫిర్యాదు లో తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని తివారీ హామీ ఇవ్వడం తో అతడిపై ఫిర్యాదు చేయలేదని తెలిపింది. అయితే, ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, తరచూ బెదిరింపులు వస్తున్నాయని తనకు రక్షణ కల్పించాలంటూ బాధితురాలు తాజాగా పోలీసులను ఆశ్రయించింది. దీనితో యూపీ ప్రభుత్వం బాధిత మహిళకు భద్రతను మరింత పెంచింది. ముగ్గురు కానిస్టేబుళ్లతో బాధిత మహిళకు 24గంటలపాటు రక్షణ కల్పించనున్నట్టు ఎస్పీ రాంబదన్‌ సింగ్‌ చెప్పారు.