Begin typing your search above and press return to search.

పవన్ ను పక్కన పెట్టిన రాపాక

By:  Tupaki Desk   |   14 March 2020 6:30 AM GMT
పవన్ ను పక్కన పెట్టిన రాపాక
X
ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనది ఒక పార్టీ నుంచి ఆ పార్టీ కోసం స్థానిక ఎన్నికల్లో పని చేయాల్సి ఉండగా.. పార్టీ తీరుకు భిన్నంగా పని చేసుకుంటూ పార్టీ అధినేత ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇదే వైఖరి అవలంభిస్తున్నాడు. అయితే దీనికి పార్టీ అధినేత ఒక్కమాట కూడా అనలేని పరిస్థితి ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలను పార్టీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే బేఖాతరు చేస్తున్నాడు. పార్టీ విధానాలను ఆయన పట్టించుకోవడం లేదు. అసలు పవన్ కల్యాణ్ ను తన నాయకుడిగా ఏనాడు గుర్తించడం లేదు. తాజాగా స్థానిక ఎన్నికల్లో కూడా అదే తీరు కొనసాగుతోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరుగుతుండగా బీజేపీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి ప్రణాళిక కూడా విడుదల చేశారు. ఈ మేరకు జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ వీటిని పట్టించుకోవడం లేదు. జనసేన, బీజేపీ పొత్తుకు విరుద్ధంగా ఎమ్మెల్యే రాపాక అధికార పార్టీ వైఎస్సార్సీపీకి మద్దతుగా పని చేస్తున్నారు. జనసేన అభ్యర్థులకు మద్దతుగా వ్యవహరించాల్సిన రాపాక అలా కాకుండా వైఎస్సార్సీపీ బీఫామ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు బీఫామ్ లు అందిస్తున్నారు. దీంతో జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తీరుతో పవన్ కల్యాణ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మూడు రాజధానులకు పవన్ వ్యతిరేకించగా ఏకంగా అసెంబ్లీ ఎమ్మెల్యే రాపాక మద్దతిచ్చాడు. అనంతరం శాసనమండలి రద్దును పవన్ వ్యతిరేకించగా రాపాక ఆ బిల్లుకు అనుకూలం గా ఓటు వేశారు. ఈ విధంగా రాజకీయాల్లోనూ, ప్రభుత్వ వ్యవహారాల్లోనూ అధికార పార్టీకి మద్దతుగా కొనసాగుతున్నారు. ఒక రకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గా ఆయన కొనసాగుతున్నారని అనిపిస్తోంది.

ఇప్పుడు పార్టీ అధినేత పవన్ కు పరీక్షగా మారారు. స్థానిక సంస్థల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేనకు తూర్పు గోదావరిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్థానిక సంస్థల్లో తమ పార్టీ కోసం కాకుండా.. వైఎస్సార్సీపీ కోసం పని చేస్తున్నారంటూ జన సైనికులు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తున్నారంట. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార పార్టీ బీఫామ్ కమిటీ ఏర్పాటుచేసింది. అందులో అమలాపురం వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ, పార్టీ రాజోలు ఇన్ ఛార్జ్ పెదపాటి అమ్మాజీ, పార్టీ నాయకుడు నేత బొంతు రాజేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే రాపాక కూడా ఉన్నాడు. ఈ వ్యవహారంతో బీజేపీ, జనసేన నాయకులు మండిపడుతున్నారు. మీ ఎమ్మెల్యేనే మీ మాట వినారా అని బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా రాపాక పవన్ కల్యాణ్ పక్కన పెట్టేసి తనకు తోచినట్టు పని చేసుకుంటూ వెళ్తున్నాడు.