Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో హ్యాపీగా ఉండొచ్చట..

By:  Tupaki Desk   |   7 July 2016 12:02 PM IST
హైదరాబాద్ లో హ్యాపీగా ఉండొచ్చట..
X
దేశంలో ఎన్నో నగరాలు.. ఒక్కో చోట జీవనం ఎంతో ఖరీదుతో కూడిన వ్యవహారమైతే.. మరికొన్ని నగరాలు సామన్యులకు స్వర్గధామాలే అయినా సౌకర్యాల్లో వెనుకబాటే. అయితే.. పేద - ధనిక అన్నది లేకుండా ఎవరికైనా బతికేలా.. సౌకర్యాలు - విలాసాలు అన్నీ దొరుకుతూనే పేదవాడు కూడా బతికే వీలున్న నగరం ఏదంటే కొన్నిటి పేర్లే వినిపిస్తాయి. వీటితో పాటు వాతావరణం - భోజనం - భద్రత వంటి మిగతా విషయాలూ తీసుకుంటే ఆ నగరాలను వేళ్ల మీదే లెక్కించొచ్చు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏదన్న విషయంలో లెక్కలు తేల్చితే హైదరాబాదుకే అగ్రస్థానం దక్కింది. ఈ మేరకు గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ కన్ సల్టింగ్ సంస్థ ‘మెర్సర్’ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలో హైదరాబాదు అన్ని భారతీయ నగరాల కంటే కూడా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 230 నగరాలతో కూడిన ఈ జాబితాలో హైదరాబాదు 139వ స్థానంలో నిలిచింది. ఆయా నగరాల్లో నివాసయోగ్యతకు సంబంధించిన 39 అంశాలను పరిగణనలోకి తీసుకున్న ‘మెర్సర్’ ఈ జాబితాను విడుదల చేసింది.

ప్రపంచ నగరాలతో పోల్చితే 139 వ స్థానంలో నిలిచిన హైదరాబాదు దేశంలో మాత్రం టాప్ ర్యాంకు కొట్టేసింది. హైదరాబాదు తర్వాతి స్థానాల్లో నిలిచిన భారతీయ నగరాల విషయానికొస్తే...144వ స్థానంలో పుణే నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు (145) - చెన్నై (150) - ముంబై (152) - కోల్ కతా (160) - ఢిల్లీ (161) స్థానాల్లో ఉన్నాయి.

కాగా ఈ ర్యాంకింగులను ఇచ్చేందుకు మెర్సర్ సంస్థ మొత్తం 39 అంశాలను పరిగణనలోకి తీసుకుంది. వాటిని పది విభాగాలుగా చేసి విస్తృత స్థాయిలో సర్వే చేసింది. రాజకీయ- సామాజిక వాతావరణం - రాజకీయ- సాంస్కృతిక - వైద్య - ఆరోగ్య సేవల లభ్యత - విద్యావకాశాలు - పౌర సేవలు - రవాణా - వినోదం - వినియోగ వస్తువులు - గృహ నిర్మాణం - సహజ వాతావరణం వంటి 39 అంశాలను తీసుకుని ఆ విషయాల్లో ఆయా నగరాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకుని ఈ ర్యాంకింగులు ఇచ్చారు.