Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: అదరగొట్టేలా ఆడారు కానీ మనమ్మాయిలు ఓడారు

By:  Tupaki Desk   |   6 Aug 2021 3:57 AM GMT
బ్రేకింగ్: అదరగొట్టేలా ఆడారు కానీ మనమ్మాయిలు ఓడారు
X
అద్భుతం త్రుటిలో తప్పిపోయింది. ఎంతగా కష్టపడినప్పటికీ కాలం కలిసి రాలేదు. హిస్టరీని క్రియేట్ చేసే అపూర్వ అవకాశం రాణి టీం చేజారింది. యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగాఎదురు చూసిన మ్యాచ్ పూర్తైంది. ఫలితం వెల్లడైంది. పోరాడి ఓడిన జట్టుగా టీమిండియామహిళల హాకీ టీం నిలిచింది. ఫ్లే ఆఫ్ పోరులో ఓటమి పాలైన జట్టు.. త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో 3-4 తేడాతో ఓడింది. గెలుపు కోసం చివరి వరకు ఎంతో కష్టపడినా ఫలితం దక్కలేదు. దీంతో కోట్లాది మంది భారతీయులకు నిరాశ తప్పలేదు.

అద్భుతమైన ఫాంతో క్వార్టర్ ఫైనల్లో ఘన విజయాన్ని సాధించిన భారత మహిళల హాకీ జట్టు.. సెమీస్ లో ఓడింది. కాంస్యం పోరులోనూ ఓటమిపాలు కావటంతో ఇంటి ముఖం పట్టక తప్పని పరిస్థితి. భారత కాలమానం ప్రకారం ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఏడు గంటలకు టీమిండియా - ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ మొదటలైంది. భారత హాకీ జట్టుకు రాణీ రాంపాల్ నాయకత్వం వహించారు. తొలి క్వార్టర్ లో ఏ జట్టు గోల్ సాధించలేదు. దీంతో.. రెండో క్వార్టర్ మొదలైంది.

ఆట ప్రారంభమైన ఆరగంట తర్వాత బ్రిటన్ జట్టు గోల్ సాధించింది. దీంతో భారత్ పై 1-0 తేడాతో అధిక్యతను ప్రదర్శించింది బ్రిటన్ జట్టు. అనూహ్యంగా భారత్ వరుస పెట్టి మూడుగోల్స్ సాధించటంతో 3-2 అధిక్యతతో నిలిచింది. దీంతో.. మనమ్మాయిలు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంటారన్న ఉత్సాహం అందరిలో పెల్లుబుకింది. వరుసగా రెండు గోల్స్ సాధించిన గుర్జీత్ కౌర్ విజయంలో కీలక భూమిక వహిస్తారన్న భావన కలిగింది.

గోల్స్ సాధనలో మనకంటే వెనుక బడిన బ్రిటన్ జట్టు తన పోరును మరింత పెంచింది. వారి దాడిని గోల్ కీపర్ సమర్థంగా ఎదుర్కొంది. అయితే.. ఆట ప్రారంభమైన గంట తర్వాత బ్రిటన్ మరో గోల్ సాధించటంతో ఇరువురి స్కోర్ సమానమైంది. అప్పటి నుంచి ఆట మరింత హోరాహోరీగా మారింది విజయానికి కీలకమైన గోల్ సాధించేందుకు ఇరు జట్లు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా భారత్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే.. పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచటంలో భారత జట్టు విఫలమైంది. అదే వేళలో మూడో క్వార్టర్ ముగిసింది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే నాలుగో క్వార్టర్ లో బ్రిటన్ కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఈ సందర్భంగా ఒక పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచటంలో బ్రిటన్ సక్సెస్ అయ్యింది. దీంతో.. 3-4 అధిక్యతను బ్రిటన్ సాధించింది.

దీంతో భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. చివరకు టైం అయిపోవటం.. బ్రిటన్ పై అధిక్యతను సాధించేందుకు గోల్ ను మలచటంలో రాణి జట్టు విఫలం కావటంతో.. ఊరించిన కాంస్యం చేతికి వచ్చినట్లే వచ్చి చేజారింది. మూడో క్వార్టర్ వరకు భారత్ అధిక్యతను.. నాలుగో క్వార్టర్ లో బ్రిటన్ జట్టు అధిగమించింది. దీంతో.. కాంస్య పతకాన్ని సొంతం చేసుకొని కొత్త చరిత్రను లిఖించాలన్న భారత మహిళా జట్టు కలలుకల్లలుగా మారాయి. మ్యాచ్ ఓడినప్పటికి తమ పోరాట పటిమతో మ్యాచ్ చూసిన వారి మనసుల్ని గెలుసుకోవటంలో మాత్రం విజయవంతమయ్యారు మనమ్మాయిలు.