Begin typing your search above and press return to search.

సెమీస్ లో రాణి రాంపాల్ టీమ్ ... గతంలో హాకీ స్టిక్ కొనడానికి కష్టమై .. !

By:  Tupaki Desk   |   2 Aug 2021 11:32 AM GMT
సెమీస్ లో రాణి రాంపాల్ టీమ్ ... గతంలో హాకీ స్టిక్ కొనడానికి కష్టమై .. !
X
టోక్యో ఒలింపిక్స్ 11వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. మహిళల 200 మీటర్ల హీట్‌ లో పరాజయాన్ని చవి చూసినప్పటికీ, దాన్ని మరిచిపోయేలా చేసింది భారత మహిళల హాకీ జట్టు. పురుషుల జట్టుతో సమానంగా పోరాడింది. క్వార్టర్ ఫైనల్స్‌ లో బలమైన ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. సెమీ ఫైనల్స్‌ లోకి దర్జాగా అడుగు పెట్టింది, రాణి రాంపాల్ టీమ్. ఇంకొక్క విజయం చాలు ఈ టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్ మరో పతకాన్ని ముద్దాడటానికి. చివరి వరకు ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగిందీ మ్యాచ్.

ఈ మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో భారత్ విజయ దుందుభి మోగించింది. ఈ విజయంతో క్రీడా ప్రపంచంలో భారత మహిళా హాకీ జట్టు పేరు మారుమోగిపోతోంది. రాణి రాంపాల్ సారథ్యంలోని భారత మహిళా హాకీ జట్టు ఈ టోక్యో ఒలింపిక్స్‌ లో సాధించిన విజయాలు.. పూర్వ వైభవాన్ని గుర్తు చేశాయి. రాణి కేప్టెన్సీ లో గుర్జీత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, ఉదిత, నిషా, నేహా, మోనికా, నవ్‌ జోత్ కౌర్, నవ్‌ నీత్ కౌర్, వందన కఠారియా ఒక్కొక్కరు ఒక్కో గోడలా కనిపించి ఉండొచ్చు ఆస్ట్రేలియా జట్టుకు. పాదరసంలా కదులుతూ, మెరుపుల్లా బంతిని పాస్ చేసుకుంటూ బంతిని ఎక్కువ భాగం తమ ఆధీనంలోనే ఉంచుకున్న తీరు, జట్టుకు తిరుగు లేదనిపించేలా చేసింది.

సెమీ ఫైనల్‌లో జట్టు విజయం లాంఛనప్రాయమే అనిపించేలా చేస్తోంది. భారత హాకీ జట్టుకు పూర్వ వైభవాన్ని కల్పించడంలో కేప్టెన్ రాణి రాంపాల్ కీలక పాత్ర పోషించారు. గ్రూప్స్ దశలో హ్యాట్రిక్ పరాజయాలు ఎదురైనప్పటికీ.. తోటి ప్లేయర్లలో విజయకాంక్షను రగిలింపజేశారు. జట్టును ముందుండి నడిపించారు. రాణి రాంపాల్ స్వస్థలం హర్యానా కురుక్షేత్ర జిల్లాలోని షాహాబాద్. తండ్రి ఎద్దులబండి నడిపించేవాడు. తల్లి పని మనిషి. తొలిరోజుల్లో విరిగిన హాకీ స్టిక్‌ తో ప్రాక్టీస్ చేసేవారు. కొత్త హాకీ స్టిక్‌ను కొనే ఆర్థిక స్థోమత కూడా లేని కుటుంబం ఆమెది. ఆకలి పోరాటం మరోవైపు. రోజూ రెండు పూటల భోజనం చేయడం అదృష్టంగా భావించే కుటుంబం నుంచి వచ్చిన రాణి రాంపాల్, దేశం గర్వించేలా చేశారు.

మహిళా హాకీ జట్టును ఒలింపిక్స్ సెమీస్‌ కు చేర్చారు. తన హాకీ ప్రస్థానానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ రాణి రాంపాల్ ఇటీవలే హ్యూమన్స్ ఆఫ్ బోంబే అనే సోషల్ మీడియా పేజ్‌పై ఓ ప్రత్యేక కథనాన్ని రాసుకొచ్చారు. హాకీ మ్యాచ్‌ లల్లో ప్రాక్టీస్ చేయాలంటే స్కర్ట్ తప్పనిసరి. దాన్ని ధరించడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తొలి రోజుల్లో సల్వార్ కమీజ్‌ లోే ప్రాక్టీస్ చేశారు. ఇలా ప్రాక్టీస్‌ లో పాల్గొనేలా కోచ్‌ ను ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని రాణి రాంపాల్ ఈ కథనంలో పేర్కొన్నారు.

కేరీర్‌ లో ఎదగడానికి కోచ్ అందించిన సహకారాన్ని విస్మరించలేనిదని రాణి రాంపాల్ అన్నారు. తనకోసం హాకీ కిట్‌ ను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. 15 సంవత్సరాల వయస్సులో జాతీయ జట్టు నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. చిన్న వయస్సులోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నానని అన్నారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం.. 2017లో సొంత ఇంటిని వారికి ఇచ్చానని రాణి రాంపాల్ రాసుకొచ్చారు. ఇప్పుడు కూడా స్వర్ణ పతకంతో టోక్య ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లాలని కలగంటున్నానని అన్నారు.