Begin typing your search above and press return to search.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు 4వారాల జైలుశిక్ష..?

By:  Tupaki Desk   |   2 Dec 2015 6:23 PM GMT
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు 4వారాల జైలుశిక్ష..?
X
ఎవరైనా సరే.. న్యాయస్థానాల విషయంలో కాస్తంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. తమకు సంబంధం లేకుండా.. కేవలం స్పందన విషయంలో వచ్చే తేడాలతో అడ్డంగా బుక్ అయి.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవటం ప్రభుత్వాధికారులకు మామూలే. తాజాగా ఆ జాబితాలోనే చేరారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందనరావు. కోర్టు ధిక్కార కేసులో కోర్టుఅగ్రహానికి గురి కావటమే కాదు.. జైలుశిక్ష తీర్పును మీదకు తెచ్చుకున్నారు.

రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలో సర్వే నెంబరు 107లో బలహీనవర్గాల కోసం నిర్మించిన గృహ సముదాయాల్లో అనధికారంగా దాదపాు 2003 మంది నివసిస్తున్నారు. వీరిని ఖాళీ చేయించాలంటూ 2007 జూలైలో ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. వారిని ఖాళీ చేయించే విషయంతో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయించటంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని.. కోర్టు తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలంటూ అధికారులు హైకోర్టును కోరారు.

అయితే.. ఈ విన్నపాన్ని పరిశీలించిన కోర్టు.. ఎట్టిపరిస్థితుల్లోనూ అనధికారంగా నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో కోర్టు నిర్ణయాన్ని అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కార నేరం కింద పిటీషన్ దాఖలైంది. దీనిపై జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు వాయిదా కోరటం.. కౌంటర్ దాఖలు చేయకపోవటం లాంటివి చేస్తున్నారు. తాజాగా.. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు కోర్టు ధిక్కార కేసు కింద నాలుగు వారాల జైలుశిక్ష.. రూ.2వేల జరిమానా విధించారు.

అయితే.. కోర్టు తీర్పు మీద ఏజీ స్పందిస్తూ.. కోర్టు తీర్పు అమలును వాయిదా వేయాలని.. ఈ తీర్పుపై తమ అప్పీలు దాఖలు చేస్తామని కోరటంతో.. ధర్మాసనం సానుకూలంగా స్పందించి తీర్పు అమలును 4 వారాలు వాయిదా వేసింది. దీంతో.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అరెస్ట్ బెడద నుంచి తప్పుకున్నారు. కోర్టు ఆదేశాల విషయంలో కాస్త కేర్ ఫుల్ గా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.