Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ నుంచి ప్రాణ‌హానీ..రాష్ట్రప‌తిని క‌లుస్తా

By:  Tupaki Desk   |   24 Dec 2018 12:51 PM GMT
టీఆర్ ఎస్ నుంచి ప్రాణ‌హానీ..రాష్ట్రప‌తిని క‌లుస్తా
X
టీఆర్ ఎస్ పార్టీ బ‌హిష్కృత నేత‌ - ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌నకు టీఆర్‌ ఎస్‌ నుంచి ప్రాణహాని ఉన్నదని ఎమ్మెల్సీ రాములునాయక్‌ అన్నారు. యాక్సిడెంట్‌ చేసో.. వేరే ప్లాన్‌ వేసో తనను హతమారుస్తారని అనుమానం వ్యక్తం చేశారు. తనను చంపించేందుకు సుపారీ కూడా ఇస్తారన్నారు. తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని.. జైలుకు పంపించాలని టీఆర్‌ ఎస్‌ చూస్తోందని నాయక్‌ ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేర‌న‌లేద‌ని రాములునాయ‌క్ ట్విస్ట్ ఇచ్చారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని టీఆర్ ఎస్ ఫిర్యాదు ఇచ్చిన నేప‌థ్యంలో రాములునాయ‌క్ మండ‌లి చైర్మ‌న్ ను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ``చైర్మన్ నుండి నోటిస్ ఇచ్చినందుకు వివరణ ఇచ్చాను. నాలుగు వారాలు చైర్మన్ ను గడువు కోరాను.నా విష‌యంలో చైర్మన్ స్పందన బాగాలేదు.టీఆర్ ఎస్‌ లో చేరిన వాళ్ళకు ఒక న్యాయం ..మాకు మరో న్యాయమా? నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతా ..కోర్ట్ కు వెళతా ..రాష్ట్రపతికి పిర్యాదు చేస్తా `` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. సోషల్ వర్కర్ గానే నాకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని - ఎస్టీని అయినందుకే కేసీఆర్ నన్ను సస్పెండ్ చేశారని రాములు నాయ‌క్ ఆరోపించారు.

త‌న‌పై అక్రమ కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని రాములు నాయ‌క్ వ్యాఖ్యానించారు. ``నాపై సుపారీ ఇచ్చి నన్ను అంతమొందించే కుట్ర జరుగుతుంది. నన్ను ఖతం చేయాలని చూస్తున్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని నేను కలిసిన మాట నిజమే.రిజర్వేషన్లు పెంచాలని వినతిపత్రం ఇచ్చేందుకు కలిశాను. నేను కాంగ్రెస్ సభ్యుడిని కాదు. నాకు టీఆర్‌ ఎస్‌ నుంచి ప్రాణహాని ఉంది. యాక్సిడెంట్‌ చేసో.. వేరే ప్లాన్‌ వేసో తనను హతమారుస్తారు. న‌న్ను చంపించేందుకు సుపారీ కూడా ఇస్తారు.`` అంటూ క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్య‌లు చేశారు.