Begin typing your search above and press return to search.

రాములమ్మ చాలా స్పీడులో ఉందిగా

By:  Tupaki Desk   |   27 April 2022 11:00 PM IST
రాములమ్మ చాలా స్పీడులో ఉందిగా
X
రాములమ్మ అలియాస్ విజయశాంతి మామూలు స్పీడులో లేదు. కేసీయార్ గురించి, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) గురించి, కాంగ్రెస్ గురించి చాలా విషయాలను చెప్పారు. ఎన్నికల తర్వాత కేసీయార్ బిస్తర్ సర్దేసి అమెరికాకు వెళ్ళిపోతారట.

ప్రతి గడ్డపైనా కాషాయ జెండా ఎగరటం ఖాయయట. ప్రజలు బీజేపీని ఆశీర్వదించే కొద్దీ కేసీయార్ లో భయం పెరిగిపోతోందట. ప్రజలు బీజేపీని ఎప్పుడు, ఎక్కడ ఆశీర్వదించారో మాత్రం రాములమ్మ చెప్పలేదు.

కాంగ్రెస్ లో ఎవరు గెలవరట, గెలిచినా ఆ పార్టీలో మాత్రం ఉండరట. ఇది మాత్రం నిజంగా చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలను కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, పాండిచ్చేరిలో టోకున బీజేపీ కొనేసిందిగా. బహుశా ఇక్కడ కూడా అలాగే కొనే ఆలోచనలో ఉన్నట్లుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనట. పీకే ఉదయం ప్రగతిభవన్లో టిఫిన్ చేసి మధ్యాహ్న భోజనం ఢిల్లీ ఏఐసీసీ ఆఫీసులో చేస్తారట.

టీఆర్ఎస్+కాంగ్రెస్ కలిసే పోటీచేస్తాయని, ఈ మేరకు ఒప్పందం చేసుకున్నది వాస్తవమంటు బల్లగుద్దకుండానే చెప్పేశారు. ఒకపుడు 2 ఎంపీ స్ధానాలున్న బీజేపీ ఇపుడు దేశాన్ని ఏలుతోందన్నారు.

అలాగే ఇపుడు తెలంగాణలో 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణాను ఏలుతుందన్నారు. నిజంగా ఈ మాత్రం ఆశ ఉండటంలో తప్పేలేదు. రాష్ట్రానికి డబల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందంటున్నారు.

గ్రామాలకు కేంద్రం నిధులిస్తుంటే కేసీయార్ ప్రభుత్వం వాటిని ప్రజలకు చేరకుండా కుట్రలు చేస్తోందంటు మండిపోయారు. నిజంగానే కేంద్రం గ్రామాలకు నిధులిస్తుంటే రాష్ట్రం ఏ విధంగా అడ్డుకోగలదు ? టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందట. అందరూ ఈ మాట చెప్పేవాళ్ళే కానీ ఒక్కరూ ఆ అవినీతిని నిరూపించటమే లేదు.

పేదోళ్ళ ఆత్మబలిదానంతో వచ్చిన ప్రత్యేక తెలంగాణాను పెద్దోడు ఏలుతున్నట్లు పంచ్ డైలాగ్ ఒకటి కొట్టింది రాములమ్మ. బీజేపీ నేతృత్వంలో గడీలను బద్దలుకొట్టి తెలంగాణా ద్రోహులను జనాలు తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నట్లు రాములమ్మ చెప్పారు. మరి ఈమె చెప్పేది ఎప్పుడు జరుగుతుందో చూడాల్సిందే.