Begin typing your search above and press return to search.

రామోజీ 4 సరికొత్త ఛానళ్లకు డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   1 Nov 2015 4:10 AM GMT
రామోజీ 4 సరికొత్త ఛానళ్లకు డేట్ ఫిక్స్
X
తెలుగుకు సంబంధించి ఇప్పటికే చాలానే ఛానళ్లు ఉన్నాయి. అయితే.. వీటిల్లో అత్యధికం 24 గంటల వార్తా ఛానళ్లే. వినోదాలకు సంబంధించి తెలుగు ఛానళ్లు పరిమితమేనని చెప్పాలి. ఇక.. విద్యా.. వైద్య రంగాలకు సంబంధించి కొన్న ఛానళ్లు ఉన్నా వాటి ప్రభావం అంతంతమాత్రమే. దీనికి సంబంధించి టీవీ రంగంలో ఉన్న స్పేస్ ను గుర్తించిన రామోజీరావు ఒకేసారి నాలుగు సరికొత్త తెలుగు ఛానళ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏది చేసినా భారీగా.. గ్రాండ్ గా చేసే రామోజీ.. తాజాగా ఒకేసారి నాలుగు తెలుగు ఛానళ్లను.. అది కూడా వివిధ అంశాలకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ మరో ట్రెండ్ సృష్టిస్తున్నారని చెప్పాలి.

మీడియా మొఘల్ గా పేరున్న రామోజీ.. ఏం చేసినా ఓ రేంజ్ లో చేస్తారన్న పేరుంది. అందుకు తగ్గట్లే.. నాలుగు వినోద.. వైద్య ఛానళ్లను లైవ్ లోకి తీసుకురావటానికి డేట్ ఫిక్స్ చేశారు. టీవీ ఛానళ్లు అన్న మాట కొత్తగా వినిపించే రోజుల్లేనే ఒకేసారి వివిధ భాషలకు చెందిన పదికి పైగా ఛానళ్లను స్టార్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా తెలుగు వినోద ఛానళ్లకు ఉన్న స్పేస్ ను భర్తీ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారని చెప్పాలి. ఇందుకు ఆయన ఎంపిక చూస్తేనే రామోజీ తెలివితేటలు ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

వినోదాలకు కేరాఫ్ లా ఉండేలా ‘‘ఈటీవీ ప్లస్’’(ఎంటర్ టైన్ మెంట్).. ఓన్లీ సినిమాలతో అలరించేందుకు వీలుగా ‘‘ఈటీవీ సినిమా’’.. మహిళల్ని విశేషంగా ఆకట్టుకునే వంటా వార్పు కార్యక్రమాలతో నిండి ఉండే పూర్తి స్థాయి ఛానల్ గా ‘‘ఈటీవీ అభిరుచి’’.. ప్రజల్లో ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనను దృష్టిలో ఉంచుకొని 24 గంటలూ ఆరోగ్యం గురించి సమాచారం అందించేందుకు వీలుగా.. ‘‘ఈటీవీ లైఫ్’’ పేరిట ఛానళ్లను తీసుకురానున్నారు. ఈ నాలుగు ఛానళ్లను నవంబరు 14న లైవ్ లోకి తీసుకురానున్నారు. తాజాగా వస్తున్న నాలుగు ఛానళ్లతో ఈటీవీకి సంబంధించి మొత్తం 7 ఛానళ్లు ఉండనున్నాయి.